The Bads of Bollywood | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ‘ఆర్యన్ ఖాన్’ దర్శకత్వం వహించిన ‘బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌తో డెబ్యూతోనే మంచి మార్కులు సంపాదించాడు ఆర్యన్ ఖాన్. అయితే సిరీస్‌లో రణబీర్ కపూర్ ఇ-సిగరెట్(ఎలక్ట్రానిక్ సిగర్) తాగిన సన్నివేశం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) జోక్యం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ వెబ్ సిరీస్‌లో అతిథి పాత్రలో మెరిశాడు రణబీర్ కపూర్. అయితే ఇందులో ఒక సన్నివేశంలో రణబీర్ కపూర్ ఇ-సిగరెట్ తాగుతూ కనిపిస్తాడు. ఇండియాలో 2019 నుంచి ఎలక్ట్రానిక్ సిగరెట్ల వాడకంపై నిషేధం ఉంది. దీంతో నిషేధం విధించిన ఇ-సిగరెట్‌ను ఎలా వాడతరంటూ ఈ సన్నివేశంపై వినయ్ జోషి అనే వ్యక్తి NHRCకు ఫిర్యాదు చేశారు. నిషేధిత వస్తువులను ఉపయోగించడమే కాకుండా, ఎటువంటి హెచ్చరికలు లేదా డిస్క్లెయిమర్లు లేకుండా ఈ సన్నివేశం ప్రసారం చేయబడిందని ఆయన ఆరోపించారు. ఇక ఈ ఫిర్యాదును స్వీకరించిన NHRC కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శికి అలాగే ముంబై పోలీసులకు నోటీసులు జారీ చేసింది. అలాగే రణబీర్ కపూర్, నెట్‌ఫ్లిక్స్ సంస్థ, సిరీస్ నిర్మాతలపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. యూత్ ను తప్పుదోవ పట్టించేలా ఈ సన్నివేశం ఉందని NHRC సీరియస్ అయింది. ఈ విషయంలో తీసుకున్న చర్యలపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని చిత్ర నిర్మాతలను ఆదేశించింది. అయితే ఈ వివాదంపై రణబీర్ కపూర్, నెట్‌ఫ్లిక్స్ లేదా సిరీస్ బృందం ఇంకా స్పందించలేదు