Kanya Kumari Movie | టాలీవుడ్ నటి మధు శాలిని సమర్పకురాలిగా వచ్చిన తాజా చిత్రం ‘కన్యాకుమారి’(Kanya Kumari). ‘అన్ ఆర్గానిక్ ప్రేమకథ’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో గీత్ సైనీ, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటించగా.. సృజన్ అట్టాడ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. అ చిత్రం వినాయక చవితి కానుకగా.. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విలేజ్ లవ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఎలా ఉందో ఒకసారి రివ్యూలో చూసుకుందాం.
కథ
తిరుపతి (శ్రీచరణ్), కన్యాకుమారి (గీత్ సైని) చిన్నప్పటి నుండి స్నేహితులు. తిరుపతికి రైతు కావాలని, వ్యవసాయం చేయాలని కోరిక. కన్యాకుమారి మాత్రం పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కలలు కంటుంది. కానీ, తిరుపతి చిన్నప్పుడే చదువు మానేసి రైతుగా మారతాడు. మరోవైపు, కన్యాకుమారి తన కుటుంబ సమస్యల వల్ల డిగ్రీ పూర్తి చేసి బట్టల షాప్‌లో పని చేస్తుంది. తిరుపతికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే, అతను రైతు అని తెలిసి అందరూ వద్దంటారు. ఇదే సమయంలో కన్యాకుమారికి కూడా సంబంధాలు వస్తాయి, కానీ ఆమెకి కాబోయే భర్త మంచి ఉద్యోగం చేయాలి, తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కలను నెరవేర్చుకోవడానికి మద్దతు ఇవ్వాలి, మరియు సిటీలో స్థిరపడాలి అనే షరతులు పెడుతుంది.
ఒక స్నేహితుడి సహాయంతో తిరుపతి, కన్యాకుమారి మళ్లీ కలుసుకుంటారు. తిరుపతి రైతు అని కన్యాకుమారి మొదట పట్టించుకోదు. అయితే, తిరుపతి తన చిన్ననాటి ప్రేమను మళ్లీ గుర్తు చేసి, ఆమెతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. చివరికి వారిద్దరూ ప్రేమలో పడతారు. కానీ అదే సమయంలో కన్యాకుమారి కుటుంబం ఆమెకు ఒక సంబంధాన్ని చూస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా మారడానికి ఆ సంబంధం మద్దతు ఇస్తుందని ఆమె భావించి దానికి ఓకే చెబుతుంది. కన్యాకుమారి కోసం తిరుపతి తన ఇష్టమైన వ్యవసాయాన్ని వదిలి, ఇష్టం లేకపోయినా ఉద్యోగంలో చేరుతాడు. అయితే చివరికి ఈ కథలో తిరుపతి, కన్యాకుమారిల ప్రేమ నిలిచిందా? తిరుపతి తన ఉద్యోగం మానేసి మళ్ళీ వ్యవసాయానికి తిరిగి వెళ్ళాడా? కన్యాకుమారి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యిందా? కన్యాకుమారి ఒప్పుకున్న సంబంధం ఏమైంది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
కన్యాకుమారి టీజర్‌లోని హీరోయిన్ చీరల గురించి చెప్పిన డైలాగ్ బాగా వైరల్ అవ్వడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఇది ఒక సాధారణ ప్రేమకథ. ఈ కథ పల్లెటూరి వాతావరణంలో రూపొందించబడింది. రెండు విభిన్న మనస్తత్వాలున్న అబ్బాయి-అమ్మాయి మధ్య ప్రేమ ఎలా పుట్టింది, వాళ్ళ ప్రేమ సఫలమైందా, వాళ్ళ కెరీర్ల కోసం వాళ్ళు ఏం చేశారు, వారి మధ్య తలెత్తిన గొడవలు ఏంటి వంటి అంశాలను చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
కథనం సాధారణంగా ఉన్నప్పటికీ, కొంత కొత్తగా, తాజాగా అనిపిస్తుంది. సినిమా మొదటి భాగం ఎక్కడా విసుగు అనిపించకుండా సరదాగా, అందమైన ప్రేమకథగా సాగిపోతుంది. రెండో భాగంలో హీరో హీరోయిన్ కోసం ఏదైనా చేయడం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. కానీ, వారి కెరీర్ల విషయంలో వచ్చిన గొడవతో కథనం సాగదీసినట్టు అనిపిస్తుంది. ఏడుపులు, భావోద్వేగ సన్నివేశాలతో కాస్త నీరసంగా మారుతుంది. సినిమా చివరి భాగం ఎప్పుడు పూర్తవుతుందా అని చూసేలా చేస్తుంది. ముగింపు సన్నివేశం అయినట్లే అనిపిస్తుంది కానీ నిజమైన ముగింపు కాదు. క్లైమాక్స్ ఇంకాస్త స్పష్టంగా, సులభంగా రాసుకుని ఉంటే బాగుండేది. అక్కడక్కడా ఉన్న కామెడీ సన్నివేశాలు బాగా నవ్వు తెప్పిస్తాయి. ఈ సినిమా శ్రీకాకుళం నేపథ్యంలో, అక్కడి యాసతో తెరకెక్కించడం కథకు బాగా కలిసొచ్చింది. సినిమా పేరుకు తగ్గట్టే, కథ మొత్తం హీరోయిన్ చుట్టూ నడుస్తుంది.
నటీనటులు
కన్యాకుమారి టైటిల్ పాత్రలో నటించిన గీత్ సైని అద్భుతంగా నటించింది. పల్లెటూరి అమ్మాయిలా, చదువుకుని ఉద్యోగం చేయాలనే పట్టుదల ఉన్న అమ్మాయిగా, బట్టల షాపులో చీరలు అమ్ముకునే అమ్మాయిగా ఆమె తన పాత్రలో ఒదిగిపోయింది. సంభాషణలు బాగా పలికిస్తూ, కొన్ని సన్నివేశాల్లో కళ్ళతోనే అభినయించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. కొత్త నటుడు శ్రీచరణ్ వ్యవసాయాన్ని ఇష్టపడే యువకుడిగా, అలాగే ప్రేమకథలో కూడా చక్కగా నటించాడు. భద్రం తన పాత్రలో నవ్వించడానికి ప్రయత్నించాడు. మిగిలిన కొత్త నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగా
సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలం. సహజమైన ప్రదేశాలు, పల్లెటూరి వాతావరణాన్ని అందంగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ విజయం సాధించారు. నేపథ్య సంగీతం మరియు పాటలు పర్వాలేదనిపించేలా ఉన్నాయి, కథకు సరిపోయాయి. దర్శకుడు ఒక సాధారణ ప్రేమకథను ఎంచుకున్నప్పటికీ, దాన్ని ఆసక్తికరంగా తెరపై చూపించడంలో సఫలమయ్యాడు. ప్రేమకు సంబంధించిన సంభాషణలు చాలా బాగా రాశారు. అయితే, కథనం కొంతవరకు నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా, సినిమా ద్వితీయార్థంలో ఎడిటింగ్ ఇంకా మెరుగ్గా ఉండి ఉంటే బాగుండేది. కొన్ని సన్నివేశాలను తగ్గించి, మరింత వేగంగా కథను నడిపి ఉంటే సినిమా మరింత ఆకట్టుకునేది. నిర్మాణ విలువలు బాగున్నాయి, సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టారు. మొత్తం మీద, ‘కన్యాకుమారి’ ఒక రొటీన్ పల్లెటూరి నేపథ్య కథ అయినప్పటికీ, ప్రేక్షకులను ఎక్కువగా విసుగు పరచకుండా బాగానే తీశారని చెప్పవచ్చు.
రేటింగ్ : 2.75/5