Tollywood | గత ఏడాది తెలుగు సినిమా ప్రయాణం సంతృప్తికరంగానే సాగిందని చెప్పొచ్చు. కల్కి, పుష్ప-2 చిత్రాల ద్వారా మరోమారు జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటింది. అపూర్వ విజయాలతో పాటు అనుకోని వివాదాలు చుట్టుముట్టడంతో పరిశ్రమ కాస్త కలవరపాటుకు గురైంది. ఈ నేపథ్యంలో గతాన్ని సమీక్షించుకుంటూ కొంగొత్త ఆశలతో నూతన సంవత్సరాదిలోకి అడుగుపెట్టింది. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి సంరంభానికి తెరలేవబోతున్నది. అగ్ర హీరోల చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించడానికి ముస్తాబవుతున్నాయి. ఈ సందర్భంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పలు సినిమాల కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. అదే సమయంలో కొన్ని చిత్రాల తాజా అప్డేట్స్ కూడా వెలువడ్డాయి. అవేమిటో ఓసారి చూద్దాం..
అగ్ర హీరో పవన్‌కల్యాణ్ చారిత్రక యోధుడిగా నటిస్తున్న చిత్రం ‘హరిహరవీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి జ్యోతికృష్ణ దర్శకుడు. ఏ.దయాకర్ రావు నిర్మాత. మార్చి 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ఈ సినిమాలోని ‘మాట వినాలి..’ అనే గీతాన్ని ఈ నెల 6న విడుదల చేయబోతున్నారు. కీరవాణి స్వరపరచిన ఈ గీతాన్ని పెంచల్దాస్ రచించారు. ఈ పాటను పవన్‌కల్యాణ్ స్వయంగా ఆలపించడం విశేషం. చైతన్య గీతమిదని, యువతలో స్ఫూర్తినింపే విధంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు.
రామ్ పోతినేని కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మహేష్‌బాబు దర్శకుడు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఈ సినిమాలో సాగర్ అనే పాత్రలో రామ్ కనిపించనున్నారు. బుధవారం కథానాయిక భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దీనిపై ‘మన సాగర్గాడి లవ్వు..మహాలక్ష్మి’ అనే క్యాప్షన్ ఆకట్టుకునేలా ఉంది.
శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ ఈనెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఏ.సర్టిఫికెట్ లభించింది. నేడు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందని, రాజకీయ, సామాజికాంశాలను చర్చిస్తూ దర్శకుడు శంకర్ తనదైన శైలిలో సినిమాను రూపొందించాడని మేకర్స్ తెలిపారు. కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నదించారు.
నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. సక్సెస్ఫుల్ ‘హిట్’ సినిమా ఫ్రాంఛైజీలో వస్తున్న మూడో చిత్రమిది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంతి తిపిర్నేని నిర్మాత. శ్రీనిధిశెట్టి కథానాయిక. ఇటీవలే కశ్మీర్లో ఓ షెడ్యూల్ పూర్తయింది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. బుధవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మే 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్, సంగీతం: మిక్కీ జే మేయర్, రచన-దర్శకత్వం: శైలేష్ కొలను.
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాబిన్‌హుడ్’ కొత్త పోస్టర్‌ను కూడా బుధవారం విడుదల చేశారు.
డీజే టిల్లు ఫ్రాంఛైజీ చిత్రాల సూపర్ సక్సెస్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘జాక్’ (కొంచెం క్రాక్). బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుందని, హాస్యప్రధానంగా అలరించే చిత్రమిదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి అచ్చు రాజమణి స్వరకర్త.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ నెల 24న విడుదలకానుంది. బుధవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ, ఆయన బాటలో నడిచే ఓ పదమూడేళ్ల అమ్మాయి తాను పుట్టిన ఊరి కోసం ఏం చేసిందన్నదే ఇతివృత్తమని, తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు తప్పకుండా చూపించాల్సిన చిత్రమిదని దర్శకురాలు పద్మావతి మల్లాది పేర్కొన్నారు.
రాజ్‌తరుణ్ తాజా చిత్రం ‘పాంచ్‌మినార్’ ఫస్ట్‌లుక్‌ను బుధవారం రిలీజ్ చేశారు. క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. రామ్ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మాధవి, ఎమ్ఎస్ఎమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నేపథ్యంలో సాగే క్రైమ్ కామెడీ కథాంశమిదని, ఆద్యంతం ఉత్కంఠను పంచుతుందని మేకర్స్ తెలిపారు. రాశీసింగ్, అజయ్‌ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆదిత్య జవ్వాది, సంగీతం: శేఖర్‌చంద్ర, రచన-దర్శకత్వం: రామ్ కుడుముల.