Anand Deverakonda | మిడిల్‌క్లాస్ మెలొడీస్, బేబీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఆనంద్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘డ్యూయెట్’. మిథున్ వరదరాజ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. రితిక నాయక్ కథానాయిక. శుక్రవారం ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘డ్యూయెట్’ సినిమలో తాను పోషిస్తున్న ‘మదన్’ పాత్ర లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. మనసంతా ప్రేమను నింపుకున్న ప్రేమికుడిగా ఇందులో ఆనంద్ దేవరకొండ కనిపిస్తారని, త్వరలోనే ‘డ్యూయెట్’ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.
విభిన్నమైన ప్రేమకథాచిత్రంగా రూపొందుతోన్న ‘డ్యూయెట్’ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉందని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని నిర్మాత తెలిపారు. రావురమేశ్ ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.అలాగే ఆనంద్ దేవరకొండ నటిస్తున్న మరో చిత్రం ‘గం..గం..గణేశా’. ఈచిత్రం కూడా నిర్మాణదశలో ఉంది. ఆనంద్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు చెందిన కొత్త పోస్టర్ని నిర్మాతలైన కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి విడుదల చేశారు. ఉదయ్‌శెట్టి ఈ చిత్రానికి దర్శకుడు. ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా కథానాయికలు. త్వరలో సినిమా విడుదల కానుంది.