Netflix | ఇప్పటివరకు అంతర్జాతీయ కంటెంట్, హాలీవుడ్ చిత్రాలతో భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్న నెట్‌ఫ్లిక్స్ (Netflix OTT) ఇప్పుడు రీజనల్ సినిమాలపై మరింత దృష్టి పెడుతోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకొని, 2026లో థియేటర్లలో విడుదలయ్యే పలు భారీ చిత్రాల డిజిటల్ హక్కులను ముందుగానే సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన లిస్టు ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
అదే విధంగా విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 (ఏకే 47)’ కూడా మల్టీ లాంగ్వేజ్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్న సినిమాలకూ నెట్‌ఫ్లిక్స్ పెద్దపీట వేస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’, అలాగే న్యాచురల్ స్టార్ నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రాలు థియేటర్లలో సందడి చేసిన అనంతరం పాన్ ఇండియా భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’, ఫహాద్ ఫాజిల్ హీరోగా శశాంక్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ వంటి ప్రాజెక్టులు కూడా నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ లైనప్‌లో చోటు దక్కించుకున్నాయి. అలాగే విజయ్ దేవరకొండ – రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా సినిమా స్ట్రీమింగ్ హక్కులు కూడా ఈ ఓటీటీ సొంతం చేసుకుంది.
యంగ్ హీరోల సినిమాలకూ నెట్‌ఫ్లిక్స్ మంచి ప్రాధాన్యత ఇస్తోంది. విశ్వక్ సేన్ నటిస్తున్న ‘ఫంకీ’, సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ‘రాకాస’, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ‘418’ వంటి సినిమాలు కూడా త్వరలో డిజిటల్ ప్రేక్షకులను పలకరించనున్నాయి. అదేవిధంగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న మరో చిత్రం, అలాగే శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ‘ఛాంపియన్’ సినిమాలు ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే, 2026లో తెలుగు సినిమా అభిమానులకు నెట్‌ఫ్లిక్స్ భారీ విందు అందించబోతోంది. స్టార్ హీరోల నుంచి యంగ్ టాలెంట్ వరకు విభిన్న శైలుల సినిమాలతో, థియేటర్ల తర్వాత కూడా డిజిటల్లో సందడి చేయడానికి నెట్‌ఫ్లిక్స్ పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది.