పుష్ప సినిమా కోసం సమంత తొలిసారిగా ఐటెం భామగా మారిన విషయం తెలిసిందే. ‘ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా అనే ఐటెం సాంగ్ లో సమంత రచ్చ చేయగా, ఈ పాటని రచయిత చంద్రబోస్ రాసారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే ఇందులో చంద్రబోస్ రాసిన లిరిక్స్ పురుషులకి వ్యతిరేఖంగా ఉండడంతో కొన్ని సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ పురుషుల సంఘం కోర్టు ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఈ పాటకు తమిళంలోనూ వ్యతిరేకత వస్తోంది. ఈ పాటలోని ‘మీ మగబుద్ధే వంకరబుద్ధి..’ అనే లిరిక్స్ వివాదం రేపుతున్నాయి. తాజాగా తమిళనాడు పురుషుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పాటను తొగించకుంటే పాటకు డ్యాన్స్ చేసిన సమంత, పాట పాడిన ఆండ్రియా, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్, గేయరచయిత వివేకాపై కేసు పెడతామని హెచ్చరించింది. తమిళంలో ఈ పాటను వివేకా కాయగా, ఆండ్రియా ఆలపించింది. ‘ఓ సొల్రియా’ అనే పాట తమిళంలోనూ సూపర్ హిట్ అయింది.
పాటలో ఉన్న పదాలు పురుష సమాజాన్ని మొత్తం కించపరిచేలా ఉందని, అందుకే ఈ పాటను బ్యాన్ చేయాలంటూ తమిళనాడులోని పురుషుల సంఘం ఏపీలోని చిత్తూరు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరోవైపు సమంత పట్ల ఆడవాళ్ళ ఆలోచన మరోలా ఉంది. మగాళ్ల వక్ర దృష్టిని ఈ పాట ద్వారా బయటపెట్టారని మహిళలు సమంతను అభినందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో సమంతకు, లిరిసిస్ట్ చంద్రబోస్ చిత్రపటాలకు పాలాభిషేకం కూడా చేశారు. అలాగే పుష్ప మూవీని మొదటిరోజు థియేటర్స్ లో చూస్తామని చిత్ర యూనిట్ కి హామీ ఇచ్చారు.