NBK 111 Movie | ఒకవైపు అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నందమూరి నటసింహం బాలయ్య మరోవైపు తన కొత్త సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. తనకు ‘వీర సింహా రెడ్డి’ వంటి సంచలన విజయం ఇచ్చిన దర్శకుడు గొపిచంద్ మలినేనితో బాలయ్య తన కొత్త చిత్రం చేయబోతున్నాడు. ఎన్బీకే 111 (NBK 111) అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్ నేడు పూజా కార్యక్రమాలతో అధికారింగా ప్రారంభమైంది. బుధవారం సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత కేఎస్ రామారావు, దర్శకుడు బుచ్చిబాబు, దర్శకుడు బాబి కొల్లి తదితరులు హాజరయ్యారు.
ఈ సినిమా ఒక చారిత్రక యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని శక్తిమంతమైన యోధుడు పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. గోపీచంద్ మలినేని బాలయ్య పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, హిస్టారికల్ యాక్షన్ సీక్వెన్స్‌లను అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తున్నారు. ‘సింహా’, ‘శ్రీ రామరాజ్యం’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటం విశేషం. నయన్ ఇందులో రాణి పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య ‘అఖండ 2’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ.. డిసెంబర్ మూడో వారం నుంచి NBK 111 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాతో మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తొలిసారిగా చారిత్రక నేపథ్యాన్ని ఎంచుకోవడం ప్రాజెక్టుపై ఆసక్తిని మరింత పెంచింది.

Balakrishna Nbk111