Connect Movie Movie Review | నయనతార సినిమా వచ్చిందంటే లేడీ ఓరియంటెడ్ అని అనడం ఎప్పుడో మానేశారు. ఎందుకంటే హీరోలతో సమానంగా ఈమె సినిమాలకు కలెక్షన్స్ వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా నయన్ చేసిన సినిమాలు.. వాటికి వచ్చిన కలెక్షన్లే దీనికి నిదర్శనం. తాజాగా ఈమె కనెక్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తనతో ఇంతకు ముందు ‘మయూరి’ సినిమా చేసిన అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఈ సినిమా చేసింది నయనతార. ‘మయూరి’, ‘గేమ్ ఓవర్’ లాంటి విలక్షణ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అశ్విన్.. ‘కనెక్ట్’ సినిమాతో కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని అందరూ నమ్మారు.
అయితే ఈ సినిమాలో అంత విషయం లేదు అనేది ప్రేక్షకుల నుంచి వస్తున్న రియాక్షన్.
ఒక మామూలు దయ్యం సినిమా కథ ఇది. కాకపోతే కరోనాతో లింకు పెట్టుకున్నాడు కాబట్టి అంత ఆన్ లైన్ లోనే కథ నడిపించాడు దర్శకుడు. ఈ ఒక్క పాయింట్ మాత్రమే కనెక్ట్ సినిమాలో కొత్తగా ఉంది. కరోనాతో భర్త చనిపోతే.. ఆమె కూతురు నాన్న ఆత్మతో మాట్లాడడానికి ఆన్లైన్ లో ఇంకొకరితో మాట్లాడుతుంది. ఆ సమయంలో ఒక దుష్ట ఆత్మ ఆ అమ్మాయి శరీరంలోకి వస్తుంది. కరోనా సమయంలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు అని ఆంక్షలు ఉండటంతో.. ఆ అమ్మాయి శరీరం నుంచి ఆత్మను ఎలా విడదీశారు అనేది ఈ సినిమా కథ.
ఆ దయ్యాన్ని విడిపించే పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించాడు.
వినడానికి రొటీన్ కథలా ఉన్నా.. స్క్రీన్ ప్లేతో మాయ చేస్తాడేమో అనుకుంటే.. అది కూడా పరమ రొటీన్ గా ఉండడంతో కనెక్ట్ ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయిందని తెలుస్తోంది. నయనతార ఉన్నా.. మ్యాటర్ వీక్ గా ఉండడంతో ఈ సినిమా విజయం సాధించడం కష్టమే. పైగా ఇంటర్వెల్ లేకుండా 99 నిమిషాలు నాన్ స్టాప్ గా సాగుతుంది కథ. ఒకే ఇంట్లో సాగుతున్న కథ కావడంతో ఆడియన్స్ కు మొనాటిని వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు విశ్లేషకులు. ఆర్టిస్టుల వరకు బాగా చేసినా.. కథ కథనం అనుకున్న స్థాయిలో లేకపోవడంతో అంచనాలు అందుకోలేకపోయింది కనెక్ట్.