Nani | టాలీవుడ్లో ఎంతమంది హీరోలు ఉన్నా నానిది మాత్రం ప్రత్యేకమైన శైలి. ఆయన అనుకోవాలి కానీ స్టార్ డైరెక్టర్స్‌తో వరుస సినిమాలు చేయగలడు. కానీ ఒక్కసారి కూడా అలాంటి అవకాశం కోసం ఆయన వెయిట్ చేయలేదు. వస్తే చేస్తాడు లేకపోతే తన జోన్లో ఉన్న దర్శకుల కోసం వెతుక్కుంటాడు నేచురల్ స్టార్. మరీ ముఖ్యంగా యువ దర్శకులకు వరుసగా అవకాశాలు ఇస్తుంటాడు. కథ నచ్చితే కొత్తవాళ్లని కూడా ఎంకరేజ్ చేయడానికి నాని ఎప్పుడూ ముందే ఉంటాడు. 2023లో ఇప్పటికే ఇద్దరు కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు నాని. దసరాతో శ్రీకాంత్ ఓదెల.. పరిచయమైతే ఇప్పుడు హాయ్ నాన్న సినిమాతో శౌర్యూ వస్తున్నాడు.
ఇందులో దసరా ఏకంగా 65 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నాని మార్కెట్‌ను బాగా పెంచేసింది. ఇప్పుడు హాయ్ నాన్నపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. డిసెంబర్ 7న సినిమా విడుదల కానుంది. అంతలోనే మరో సినిమాకు ముహూర్తం పెట్టాడు నాని. అంటే సుందరానికి ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు నేచురల్ స్టార్. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. దీనికి సరిపోదా శనివారం అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. అంటే సుందరానికి అనే టైటిల్‌కు కూడా అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్ టైటిల్ తో వచ్చాడు అంటూ వివేక్ ఆత్రేయపై ప్రశంసల వర్షం కురిసింది. ఇప్పుడు మరోసారి సరిపోదా శనివారం అంటూ మరో డిఫరెంట్ టైటిల్‌తో వస్తున్నాడు ఈ దర్శకుడు.
ఈసారి తనకు అలవాటైన రొమాంటిక్ కామెడీ జోనర్ కాకుండా క్రైమ్ థ్రిల్లర్‌తో వస్తున్నాడు. నాని కూడా చాలా రోజుల నుంచి డార్క్ కామెడీ చేయాలని చూస్తున్నాడు. అందుకే వివేక్ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే దానికి ముహూర్తం పెట్టేశాడు. దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ అవుతుంది. అంటే సుందరానికి సినిమా ఫ్లాప్ అయినా కూడా వివేక్ టేకింగ్ మీద నమ్మకంతో మరో అవకాశం ఇచ్చాడు నాని.
ఈసారి కచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాడు వివేక్ ఆత్రేయ. డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్. ఈమెతో కూడా గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించాడు నాని. అది కూడా ఫ్లాప్ అయింది.. అయినా కూడా సెంటిమెంట్స్ పట్టించుకోకుండా కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాడు నేచురల్ స్టార్.