Nani | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు నాని. ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన నాని ఇప్పుడు మీడియం టైర్ హీరోల నుండి స్టార్ హీరోల లిస్ట్‌లోకి చేరాడు. నాని కష్టంతో పాటు అదృష్టం కూడా తోడు కావడంతో ఇండస్ట్రీలో నిలబడ్డాడు. మంచి మంచి విజయాలు అందిపుచ్చుకుంటూ తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లాడు. పదేళ్ల ముందు ‘భలే భలే మగాడివోయ్’తో 50 కోట్ల వసూళ్ల మార్కును అందుకుంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఇప్పుడు వంద కోట్ల మార్కుని అవలీలగా చేరుకున్న నాని విమర్శకుల నోళ్లు మూయించాడు.
రెండేళ్ల కిందట ‘దసరా’ అనే సినిమాతో వంద కోట్ల మైలురాయిని అందుకున్న నాని ఇప్పుడు ‘హిట్-3’తో మరోసారి ఆ మైల్‌స్టోన్‌ను అందుకోవడం జరిగింది. ఇక నానికి వంద కోట్ల మైలు రాయి అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని హిట్ 3తో అర్ధమైంది. నాని నటించిన సినిమాలే కాదు ఆయన నిర్మించిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించి నాని స్థాయిని పెంచుతున్నాయి. నాని కెరీర్లో ఓపెనింగ్స్ పరంగా ట్రేడ్ వర్గాలను ఎక్కువ ఆశ్చర్యపరిచిన సినిమా అంటే.. ‘ఎంసీఏ’ చిత్రం అని చెప్పవచ్చు.
నాని కెరీర్లో తొలి పూర్తి స్థాయి మాస్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం 2017లోనే రూ.15 కోట్ల మేర ఓపెనింగ్స్ రాబట్టి నాని రేంజ్‌ను ఒక్కసారిగా పెంచింది. ఇక ఈ సినిమా తర్వాత నుండి నాని సినిమాలకి పది కోట్లు ఓపెనింగ్ కామన్ అయింది. దసరా చిత్రం అయితే ఏకంగా రూ. 38 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక రీసెంట్గా వచ్చిన హిట్ 3 చిత్రం కాస్త వయోలెంట్‌గా ఉన్నా కూడా ఇందులో హీరోయిజం ఓ రేంజ్లో ఉండడం, చిత్రం మాస్కు కనెక్ట్ కావడం, ప్రి రిలీజ్ హైప్ పీక్స్‌కు చేరుకోవడంతో ఓపెనింగ్స్ ఏకంగా రూ.43 కోట్ల వసూళ్లు వచ్చాయి. ‘హిట్-3’తో సక్సెస్‌తో నాని నెక్ట్స్ చిత్రం ‘ది ప్యారడైజ్’కు కూడా కావల్సినంత హైప్ వచ్చింది. ఇప్పుడు ది ప్యారడైజ్ చిత్రానికి రూ.50 కోట్ల ఓపెనింగ్ అన్నది ఈజీ టార్గెట్ అని చెప్పొచ్చు. ఏదేమైన నాని రేంజ్ సినిమా సినిమాకి పెరుగుతూ పోతుండడం విశేషం.