Nani | ఆల్రెడీ 2023లో రెండు విజయాలు అందుకుని గాల్లో తేలిపోతున్నాడు నాని. ఏడాది దసరాలో పవ్వతో మొదలుపెట్టి.. హాయ్ నాన్నలో టకీలాతో ఎండ్ చేశాడు నాని. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే తీసుకొచ్చాయి. ఇప్పుడు 2024లోనూ ఇదే కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు నాని. ఎవరెలా ఉన్నా తన పని చేసుకోవడంలో నాని ఎప్పుడూ ముందే ఉంటాడు. ఈయనపై కనీసం 30 కోట్లు పెడితే.. 50 నుంచి 70 కోట్ల వరకు రిటర్న్స్ వస్తాయి. మినిమమ్ గ్యారెంటీ హీరో కావడంతో సినిమాకు 20 కోట్ల వరకు పారితోషికం కూడా ఇస్తున్నారు నిర్మాతలు. దానికి తోడు 2023 బూస్టప్ ఇవ్వడంతో 2024ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారీయన.
2017 తర్వాత నానికి అంత బాగా కలిసొచ్చింది గతేడాదే. 2017లో నేను లోకల్, నిన్ను కోరి, ఎంసిఏ సినిమాలతో బ్లాక్‌బస్టర్స్ అందుకున్నాడు నాని. ఈ మూడు సినిమాలు కలిపి అప్పట్లోనే 130 కోట్లు వసూలు చేశాయి. మళ్లీ అంతగా ఈయనకు 2023 కలిసొచ్చింది. గతేడాది మొదట్లో దసరా.. చివర్లో హాయ్ నాన్నతో మాస్ క్లాస్ విజయాలు అందుకున్నారు నాని. ఈ రెండు సినిమాలు కలిపి దాదాపు 170 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేశాయి. ముఖ్యంగా హాయ్ నాన్నకు యావరేజ్ టాక్ వచ్చింది.. సినిమా ఆడుతుందా లేదా అనే అనుమానాలు కూడా అందరిలోనూ వచ్చాయి. కానీ నెమ్మదిగా పుంజుకోవడమే కాదు.. 40 కోట్ల షేర్ వసూలు చేసింది. మరోవైపు నెగిటివ్ టాక్‌తోనే ఓపెన్ అయిన దసరాకు కూడా 65 కోట్ల షేర్ వచ్చింది. ఇదే దూకుడు 2024లోనూ కొనసాగించాలని చూస్తున్నాడు నాని.
ప్రస్తుతం వివేక్ ఆత్రేయ సినిమాతో బిజీగా ఉన్నాడు నాని. ఇప్పటి వరకు ఎంటర్టైనింగ్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన వివేక్.. సరిపోదా శనివారంతో తన జోనర్ మార్చేస్తున్నాడు. ఇందులో యాక్షన్ చూపించబోతున్నాడు ఈ దర్శకుడు. శనివారం రోజు మాత్రమే సూపర్ పవర్స్ వచ్చే పాత్రలో ఇందులో నటిస్తున్నాడు నాని. ఈ చిత్ర షూటింగ్‌ను మార్చిలోపు పూర్తి చేసి సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. రెండేళ్ల కింద ఈ కాంబినేషన్లో వచ్చిన అంటే సుందరానికి ఫ్లాప్ అయినా వివేక్ ఆత్రేయపై నమ్మకం మాత్రం కోల్పోలేదు నాని.
అందుకే అడగ్గానే మరో ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుంది. సరిపోదా శనివారం తర్వాత కూడా వరసగా తన డైరీ ఫుల్ చేసుకున్నాడు నాని. హిట్ 3 ఇప్పటికే లైన్లో ఉంది. దీనికి నానినే నిర్మాత. 2024లోనే హిట్ 3 ఉంటుందని దర్శకుడు శైలేష్ కొలను కూడా కన్ఫర్మ్ చేశాడు. చెప్పినట్లుగానే ఇదే ఏడాది హిట్ 3 విడుదల చేయాలని చూస్తున్నాడు న్యాచురల్ స్టార్. మరోవైపు కుదిర్తే ఇంకో సినిమాను కూడా డిసెంబర్‌లోపు పూర్తి చేయాలనేది నాని ప్లాన్.