‘నేను ప్రతిభావంతుడిని అని అనుకున్నా…కానీ ప్రతిభ గల సోదరికి తమ్ముడిని మాత్రమేనని ఇప్పుడు తెలుసుకున్నా’ అని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు హీరో నాని. ఆయన సోదరి దీప్తి దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘మీట్ క్యూట్’ పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఈ చిత్రంలో సత్యరాజ్, వర్ష బొల్లమ్మ, ఆదా శర్మ, రుహానీ శర్మ, శివ కందుకూరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని నిర్మించారు. ఐదు భిన్న కథల ఆంథాలజీగా రూపొందుతున్న మీట్ క్యూట్ టీజర్ ఇవాళ రిలీజ్ కానుంది.
ఈ సినిమా గురించి నాని స్పందిస్తూ…‘ఈ సినిమాను నా సోదరి దీప్తి రూపొందించిన విధానం చూస్తుంటే గర్వంగా ఉంది. ఇంత బాగా కథను తెరకెక్కించగలిగింది అనేది సర్ప్రైజింగ్గా ఉంది. నేను టాలెంటెడ్ అనుకున్నా, ప్రతిభావంతురాలైన సోదరికి తమ్ముడిని మాత్రమేనని అర్థమైంది’ అని పేర్కొన్నారు. దీప్తి ఘంట ఈ చిత్రం గురించి మాట్లాడుతూ…‘కోవిడ్ టైమ్లో ఏడాది పాటు ఈ స్క్రిప్ట్ రాశాను. నా స్నేహితులు, బంధువులు నాపై పెట్టుకున్న నమ్మకం, చిత్రబృందం కల వెరసి ఈ సినిమా తయారైంది. ఈ ప్రాజెక్ట్ వెనక ఉన్న ప్రధాన బలం నా సోదరుడు నాని’ అని అన్నారు. ప్రముఖ ఓటీటీ వేదికగా త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.