నందిత శ్వేత ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘రారా పెనిమిటి’. ఈ చిత్రాన్ని శ్రీ విజయానంద్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి ప్రమీల గెద్దాడ నిర్మించారు. సత్య వెంకట గెద్దాడ దర్శకత్వం వహించారు. ఒకే పాత్రతో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నందిత శ్వేత మాట్లాడుతూ…‘ఒకే పాత్రతో కథ ఉంటుందని దర్శకుడు చెప్పగానే…ఈ క్యారెక్టర్‌కు న్యాయం చేయగలనా? అని భయపడ్డాను. ఇలాంటి సినిమా సాహసమే అయినా అంగీకరించాను. కొత్తగా పళ్లైన అమ్మాయి తన భర్త కోసం పడే విరహ వేదనే ఈ చిత్రం. అన్ని రకాల భావోద్వేగాలు సినిమాలో ఉన్నాయి. మా సినిమాకు విజయం చేకూరుస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. దర్శకుడు సత్య వెంకట గెద్దాడ మాట్లాడుతూ…‘గ్రామీణ వాతావరణంలో సాగే చిత్రమిది. గడుసైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో నందిత నటన మెప్పిస్తుంది. ఒకే పాత్రతో సినిమా తెరకెక్కించినా పలు క్యారెక్టర్స్ ఫోన్ ద్వారా మాట్లాడుతుంటాయి. అలా ఫోన్లో మాట్లాడే పాత్రల్లో బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సునీల్, సప్తగిరి, హేమ తదితరులు డబ్బింగ్ చెప్పారు. మణిశర్మ సంగీతం ఆకర్షణ అవుతుంది’ అన్నారు.