సినిమా పేరు: అర్జున్ సన్నాఫ్ వైజయంతి
తారాగణం: కల్యాణ్‌రామ్, విజయశాంతి, సాయి మంజ్రేకర్, పృధ్వీ..
దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
నిర్మాణం: ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక్ క్రియేషన్స్
నిర్మాణంలో ఉండగానే చర్చనీయాంశమైన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. కల్యాణ్‌రామ్ సినిమా అనగానే మాస్ ఆడియన్స్ సినిమాపై ఆసక్తి చూపించడం కామనే. అయితే.. ఈ సినిమాలో ఆయనకు సీనియర్ నటి విజయశాంతి కూడా తోడవ్వడంతో సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు మొదలయ్యాయి. పైగా తల్లీకొడుకుల నేపథ్య కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో విజయశాంతి తనకు బాగా కలిసొచ్చిన పోలీసాఫీసర్ రోల్ చేశారు. కల్యాణ్‌రామ్ పాత్ర అత్యంత శక్తిమంతంగా ఉంటుందని ప్రమోషన్స్‌లో మేకర్స్ తెలియజేశారు. మరి వారి అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉందా? ఈ తల్లీకొడుకుల ఎమోషనల్ డ్రామా ప్రేక్షకుల మనసుల్ని తాకిందా? ఈ సినిమాతో హీరో కల్యాణ్‌రామ్ హిట్ అందుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ముందు కథలోకి వెళ్లాలి.
కథ
వైజయంతి(విజయశాంతి) సిన్సియర్ ఐపీఎస్ ఆఫీస్. ఆమెకు ఒక్కకానొక్క కొడుకు అర్జున్(కల్యాణ్‌రామ్). అర్జున్‌ని ఎలాగైనా ఐపీఎస్ ఆఫీసర్‌గా చూడాలనేది వైజయంతి కల. అందుకు తగ్గట్టే తనను ఐపీఎస్ చదివిస్తుంది. ట్రైనింగ్ కోసం ఢిల్లీ పంపిస్తుంది. ఏడాది ట్రైనింగ్ పూర్తి చేసుకొని తిరిగిరావాల్సిన అర్జున్.. వెళ్లిన అయిదోరోజే తిరిగి వచ్చేస్తాడు. కారణం తన తండ్రి మరణం. నావీ అధికారి అయిన తన తండ్రి సముద్రంలో ప్రమాదవశత్తూ మరణించాడని పోలీసులు చెబుతారు. నిజానికి అర్జున్ తండ్రి మరణానికి కారణం ప్రమాదం కాదు.. అదో హత్య. ఆ విషయం తెలుసుకున్న అర్జున్.. తన తండ్రిని చంపిన వ్యక్తులపై పగ తీర్చుకోవాలనుకుంటాడు. కానీ.. అర్జున్‌ని వైజయంతి వారిస్తుంది. చట్టప్రకారం దోషులకు శిక్షపడేలా చేస్తానని, నువ్వు ఐపీఎస్ పూర్తి చేయాలని చెప్పి కొడుకుని మళ్లీ ట్రైనింగ్‌కి పంపించేస్తుంది. ఏడాది తర్వాత అర్జున్ ట్రైనింగ్ ముగించుకొని తిరిగొస్తాడు. తన తండ్రి కేసుకు సంబంధించిన జడ్జిమెంట్ ఆరోజే. అర్జున్ తండ్రిది హత్య కాదని, అది ప్రమాదవశత్తే జరిగిందని కోర్టు తీర్పు ఇస్తుంది. హంతకులు కోర్టు నుంచి బయటకొస్తూనే వైజయంతిని అవమానంగా మాట్లాడతారు. అన్యాయం ముందు చట్టం, న్యాయం ఓడిపోవడం కళ్లారా చూస్తాడు అర్జున్. తన కళ్లముందే తల్లిని అవమానిస్తుంటే భరించలేకపోతాడు. అతని కోపం కట్టలు తెంచుకుంటుంది. కోర్టు ఎదురుగానే హంతకుడ్ని కొట్టి చంపేస్తాడు. అంతేకాదు, తన తండ్రి హత్యకు కారణమైన ముఠాలో 41మందిని నరికి చంపేస్తాడు. ఐపీఎస్ కావాల్సిన కొడుకు కంటిముందే హంతకుడుగా మారడం చూసిన వైజయంతి నిశ్చేష్టురాలైపోతుంది. గూండాగా మారిన కొడుకు మీదే యుద్ధానికి సిద్ధమవుతుంది. మరి విధి విడదీసిన ఈ తల్లీబిడ్డలు మళ్లీ ఎలా కలిశారు? ఐపీఎస్ అవ్వాల్సిన అర్జున్ గూండాగా మారి సాధించిందేంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
విశ్లేషణ
భావోద్వేగాలతో కూడిన మాస్ ఎంటైర్టెనర్ ఇది. ఐపీఎస్ కావాల్సిన కొడుకు గూండాగా మారడం అనే కాన్సెప్ట్ మీద గతంలో చాలా సినిమాలొచ్చాయి. రాజశేఖర్ ‘రౌడీజం నసించాలి’ సినిమా కథ దాదాపు ఇదే. అయితే.. అందులో తండ్రి సత్యనారాయణ కానిస్టేబుల్. కొడుకును పోలీస్‌గా చూడాలనుకుంటాడు. కానీ కొన్ని కారణాలవల్ల పోలీస్ కావాల్సిన కొడుకు రౌడీగా మారతాడు. ఇది కూడా సేమ్ లైన్. కాకపోతే స్క్రీన్‌ప్లేనే తేడా. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి సినిమాను నడిపించిన విధానం బావుంది. హీరోను గూండాగా ఓపెన్ చేసి, తాను అలా మారడానికి గల కారణాన్ని హృద్యంగా చెప్పిన తీరు బావుంది. తండ్రిని చంపిన వారిపై పగతీర్చుకోవడం.. ఈ క్రమంలో కష్టాల్లోవున్న జనాలకు అండగా నిలవడం.. కథలో ప్రధానమైన అంశాలు ఈ రెండు అయితే.. వీటికి తోడు డ్రగ్స్‌ని, మాఫియాని కూడా లింక్ చేశాడు దర్శకుడు. ఒకడ్ని మించిన ఒకడ్ని విలన్‌గా పరిచయం చేసుకుంటూ.. ఒకడి తర్వాత ఒకడ్ని చంపుకుంటూ మొత్తంగా తెరంతా రక్తపాతాన్ని సృష్టించేశాడు దర్శకుడు ప్రదీప్ చిలుకూరి. యాక్షన్ ఎపిసోడ్స్ అన్నీ బావున్నాయి. ఓ దశలో కథలోని ఎమోషన్ని యాక్షన్ డామినేట్ చేసిందా అనిపిస్తుంది.
నటీనటులు
అర్జున్‌గా కల్యాణ్‌రామ్ బాగా నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో ఆయన అభినయం బావుంది. సెంటిమెంట్ సీన్స్‌లో కూడా బాగా రాణించాడు. ఇక విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?! గొప్పనటి. అద్భుతంగా చేస్తుంది. సాయిమంజ్రేకర్ చూడ్డానికి బావుంది. ఆమె చేయడానికి ఏమీలేదు. సినిమా మొత్తంమీద ఆమెది ఒకే ఒక్క ఎక్స్ప్రెషన్. శ్రీకాంత్ చాలారోజుల తర్వాత నెగెటివ్ రోల్ చేసి, మెప్పించారు. మిగతా నటీనటులంతా తమ పాత్రలను పరిధిమేర రక్తికట్టించారు.
సాంకేతికంగా
కథ పాతదే. కథనం కాస్త కొత్తగా ట్రై చేశారు. ఆ విషయంలో కొంతమేర దర్శకుడు సక్సెస్ అయ్యారు. అజనీష్ లోక్‌నాథ్ తన నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నారు. రామ్‌ప్రసాద్ కెమెరా వర్క్ బావుంది. ఎడిటర్‌కి ఇంకాస్త పనుందేమో అనిపించింది. మొత్తంగా సాంకేతికంగా కూడా సినిమా బావుంది. ప్రస్తుతం మాస్ సినిమాలేవీ థియేటర్లలో లేవు కాబట్టి, ఇది పూర్తిగా ఎమోషన్స్‌తో కూడిన మాస్ డ్రామా కాబట్టి.. ఈ తరహా సినిమాలను ఇష్టపడేవాళ్లకు ప్రస్తుతం ఈ సినిమానే ఆప్షన్. మరి ఏ మేరకు ఈ సినిమా ఆడియన్స్‌ను మెప్పిస్తుందో చూడాలి.
బలాలు
కల్యాణ్‌రామ్, విజయశాంతి నటన, కథనం, నేపథ్య సంగీతం..
బలహీనతలు
కథ, ఎడిటింగ్..
రేటింగ్: 2.75/5