నానా పటేకర్ పేరు స్ఫురణకురాగానే ఆయన పోషించిన పాత్రలు మాత్రమే కాదు..వెండితెరపై ఓ భావోద్వేగాల విస్ఫోటనం కళ్లముందు కదలాడుతుంది. పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి వాటితో ప్రేక్షకులు సహానుభూతిచెందేలా చేయడం నానాపటేకర్లోని ప్రత్యేకత. ఆయన నటనలో ఎలాంటి ఆర్భాటం కనిపించదు. కానీ ఆ కళ్లలోని తీవ్రత, గొంతులోని గాంభీర్యం ప్రేక్షకుడిని పాత్రలో లీనమయ్యేలా చేస్తాయి. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో హిందీ, మరాఠీ చిత్రాలతో పాటు ఇతర భాషల్లోనూ తనదైన ముద్రను వేశారాయన. కేవలం నటనకే పరిమితం కాకుండా మానవీయ స్పృహతో కష్టాల్లో ఉన్న రైతులకు ఆపన్న హస్తం అందిస్తూ వితరణశీలిగా పేరు తెచ్చుకున్నారు. విలక్షణ నటనకు చిరునామాగా నిలిచిన నానాపటేకర్ హఠాన్మరణం భారతీయ కళారంగానికి తీరని లోటు.
ప్రముఖ సినీనటుడు నానాపటేకర్ (75) గురువారం ఉదయం గోవాలోని తన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆయన్ని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే నానాపటేకర్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన్ని కాపాడేందుకు దాదాపు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా ఫలితం దక్కలేదని వైద్యులు తెలిపారు. గురువారం రాత్రి పూణే సమీపంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియల్ని నిర్వహించారు.

Nata Samrat
రంగస్థలం నుంచి వెండితెరకు..
నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. 1951 జనవరి 1న మహారాష్ట్రలోని మురుద్-జంజీరా ప్రాంతంలోని సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. ముంబయిలోని సర్ జె.జె.ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఐప్లెడ్ ఆర్ట్స్‌లో విద్యాభ్యాసం చేశారు. తండ్రికి నాటకాలంటే ఇష్టం ఉండటంతో ఆయన ప్రోత్సాహంతో నానా పటేకర్ సైతం నాటకాలపై మక్కువ పెంచుకున్నారు. ముజఫర్ అలీ దర్శకత్వం వహించిన ‘గమన్’ (1978) చిత్రంతో హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టారు నానాపటేకర్. అయితే కెరీర్ తొలిదశలో ఆయనకు అంతగా గుర్తింపు రాలేదు. సహాయ పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన నటనాశైలిని ఏర్పరచుకున్నారు. అంకుష్, ప్రతిఘాత్, అంధా యుద్ధ్, సలామ్ బాంబే వంటి చిత్రాలు నటుడిగా ఆయనకు గుర్తింపును తీసుకొచ్చాయి. 1986 నాటి ‘అంకుశ్’ చిత్రం ఆయనలోని విలక్షణ నటుడిని పరిచయం చేసింది. ఎనభై దశకంలో నిరుద్యోగంతో రగిలిపోతున్న యువత ఆక్రందనను, నిస్సహాయతను తన పాత్రలో ప్రతిబింబించిన తీరు పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది.
‘పరిందా’తో కెరీర్ బ్రేక్
విధువినోద్ చోప్రా దర్శకత్వంలో రూపొందిన ‘పరిందా’ (1989) చిత్రం నానాపటేకర్ కెరీర్‌ను పూర్తిగా మలుపుతిప్పింది. ఈ క్రైమ్ డ్రామాలో నానాపటేకర్ ‘అన్నా సేఠ్’ అనే అండర్‌వరల్డ్ డాన్ పాత్రలో కనిపించారు. ఇందులో ఆయన పైకి ప్రశాంతంగా కనిపిస్తూనే క్రూరత్వాన్ని పలికించే విలన్. ఆయన తెరపై కనిపించిన ప్రతీసారి ఇప్పుడేదో ప్రమాదం జరగబోతున్నదని ప్రేక్షకులు భయకంపితులయ్యేలా ఆయన విలనిజం ప్రదర్శించారు. ముంబయి అండర్‌వరల్డ్‌లో దాగి ఉన్న భయానికి ప్రతీకలా అన్నా సేఠ్ పాత్ర నిలిచిపోయింది. ఈ చిత్రం ద్వారా ఆయన ఉత్తమ సహాయ నటుడిగా తొలిసారి జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని అందుకున్నారు. ఇక స్వీయ దర్శకత్వంలో నానా పటేకర్ నటించిన ‘ప్రహార్: ది ఫైనల్ అటాక్’ చిత్రం సైనిక నేపథ్యంలో రూపొంది ప్రశంసలందుకుంది. ఈ సినిమాలో భారత సైనికుడి పాత్ర కోసం నానా పటేకర్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

Nana Kranthiveer
‘క్రాంతివీర్’తో సూపర్ స్టార్డమ్
1994లో వచ్చిన ‘క్రాంతివీర్’ చిత్రానికి నానాపటేకర్ జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమాలో నానా పటేకర్.. ప్రతాప్ నారాయణ్ తిలక్‌గా నటించారు. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చిన ఓ యువకుడు తొలుత బాధ్యతారాహిత్యంగా జీవితాన్ని మొదలుపెట్టి..ఆ తర్వాత గొప్ప పరివర్తనతో దేశభక్తి, సామాజిక బాధ్యత వైపు ఎలా మళ్లాడనే అంశాలను ఈ సినిమాలో చూపించారు. ప్రతాప్ నారాయణ్ తిలక్ పాత్రలో నానాపటేకర్ పలికించిన సంభాషణలు సామాజిక చైతన్యాన్ని రగిల్చాయి. ‘ఏది హిందూ రక్తం, ఏది ముస్లిం రక్తం’ అంటూ ఉరికంభం సాక్షిగా ఆయన చెప్పిన సంభాషణలు ప్రజల్లో ఆలోచనల్ని రేకెత్తించాయి. సమాజ ఆగ్రహానికి గళాన్ని అందించిన కథానాయకుడు నారాయణ్ తిలక్‌గా నానాపటేకర్ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి.
నిరుద్యోగి నుంచి విప్లవకారుడి వరకు మారి ఆయన ప్రదర్శించిన నటన ప్రేక్షకుల హృదయాల్ని కదిలించింది. ఈ చిత్రానికిగాను 1995లో జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని అందుకున్నారు నానాపటేకర్. ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో విలక్షణ పాత్రలకు చిరునామాగా నిలిచారు నానాపటేకర్. ‘అగ్నిసాక్షి’లో (1996) అనుమానపు భర్తగా సంక్లిష్టమైన భావోద్వేగాలు కలబోసిన పాత్రలో మెప్పించి మూడోసారి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. రామ్‌గోపాల్‌వర్మ ‘అబ్ తక్ ఛప్పన్’ చిత్రంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సాధు అగాషే పాత్రలో నానాపటేకర్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. పోలీస్ అధికారి మనస్తత్వానికి దర్పణంలా ఈ పాత్ర సాగింది.
సంజయ్‌లీలా భన్సాలీ ‘ఖామోషీ: ది మ్యూజికల్’ చిత్రంలో మూగచెవిటి తండ్రిగా ఆయన నటన కంటతడి పెట్టించింది. ఇలాంటి తీవ్ర భావోద్వేగాలతో సాగే పాత్రల్లో మెప్పించిన నానాపటేకర్ ‘వెల్కమ్’ చిత్రంలో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు. ఉదయ్‌శెట్టి పాత్రలో అనిల్‌కపూర్‌తో కలిసి ఆయన పండించిన కామెడీ హైలైట్‌గా నిలిచింది. ప్రకాష్ ఝా దర్శకత్వంలో వచ్చిన ‘రాజ్‌నీతి’ చిత్రంలో నానా పటేకర్ పోషించిన బ్రిజ్గోపాల్ పాత్రలో రాజకీయ వ్యూహం, చాణక్యం కనిపిస్తాయి. అంగార్, అపహరణ్, శక్తి: ది పవర్ చిత్రాల్లో ఆయన ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో మెప్పించారు. 2011 తర్వాత నానా పటేకర్ హిందీతో పాటు మరాఠీ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. హిందీ సినిమాలో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ నానా తన మరాఠీ మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు.
2016లో వచ్చిన ‘నటసామ్రాట్’ ఆయన అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రంగస్థలంపై మహానటుడిగా వెలిగిన ఓ వ్యక్తి వృద్ధాప్యంలో ఎదుర్కొనే ఒంటరితనం, కుటుంబ సమస్యలు, వెంటాడే జ్ఞాపకాలు…ఈ ఉద్వేగాలన్నీ కలబోసిన గణప్రతాప్ అప్పా బెల్వాల్కర్ పాత్రలో నానా పటేకర్ అభినయం హృదయాల్ని ద్రవింపజేసింది. ఈ సినిమా ‘రంగమార్తాండ’ పేరుతో తెలుగులో రీమేక్ అయింది. రజనీకాంత్ ‘కాలా’ చిత్రంలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించారు నానా పటేకర్. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. తమిళంలో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ‘బొమ్మలాట్టమ్’ చిత్రంలో కూడా నానా పటేకర్ నటించారు. ఆయన చివరి చిత్రం ‘వన్వాస్’ 2024లో విడుదలైంది.

Nana Parindhaa
కార్గిల్ యుద్ధంలో సైనికుడిగా..
వెండితెరపై అద్భుత ప్రతిభాపాటవాలతో మెప్పించిన నానా పటేకర్ 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు. 60రోజుల పాటు యుద్ధంలో పాల్గొనట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నానాపటేకర్‌కు ఆయుధాలు వినియోగించడంలో అనుభవం ఉంది. జాతీయ స్థాయిలో రైఫిల్ షూటింగ్లో పాల్గొని కాంస్య పతకం కూడా సాధించారు. ఈ అర్హతలతో అప్పటి రక్షణ శాఖా మంత్రిని కలిసి యుద్ధంలో పాల్గొనడానికి ప్రత్యేక అనుమతి తీసుకున్నారు నానా పటేకర్. యుద్ధానికి వెళ్లేముందు 76 కేజీల బరువు ఉన్న తాను..తిరిగి వచ్చేసరికి 56 కేజీలకు తగ్గినట్లు నానా పటేకర్ చెప్పారు.
‘నామ్ ఫాండేషన్’తో రైతులకు అండగా..
వెండితెరపై గొప్ప కళాకారుడిగా రాణించిన నానా పటేకర్ సామాజిక సేవా కార్యకమ్రాలతో ఎందరో జీవితాలకు అండగా నిలిచారు. ప్రముఖ నటుడు మకరంద్ అనాస్పురేతో కలిసి ‘నామ్ ఫాండేషన్’ ను స్థాపించారు. మహారాష్ట్రలోని కరువు ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబాలను ఆదుకున్నారు. తన సంపాదనలో సింహభాగాన్ని ఈ ట్రస్ట్ కోసం వినియోగించారు. వేలాది రైతు కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనందించారు. చెరువులు, కాలువల్లో పూడికతీత, భూగర్భ జలాల పునరుద్ధ్దరణ, డ్రిప్ ఇరిగేషన్ వంటి కార్యక్రమాలకు ప్రోత్సాహాన్ని అందించారు. ఈ సంస్థ కొన్ని ప్రాంతాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించే కార్యక్రమాలను కూడా చేపట్టింది. కళారంగానికి నానాపటేకర్ చేసిన విశిష్ట సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2013లో ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.