వంద సినిమాల్లో హీరోగా నటించడం సామాన్యమైన విషయం కాదు. గతంలో హీరోలు ఏడాదికి పదిపదిహేను సినిమాలు చేసే రోజుల్లో అది చెల్లుబాటైంది. ఇప్పుడున్న హీరోలకైతే అది తీరని కలే. ప్రస్తుతం లైమ్‌లైట్‌లో ఉన్న హీరోల్లో వంద సినిమాలు పూర్తి చేసిన హీరోలు చిరంజీవి, బాలకృష్ణ మాత్రమే. వారు కూడా తమ హయాంలో ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేశారు కాబట్టే అది సాధ్యమైంది. అయితే.. ఈ వరుసలో వందకు చేరువ కాగల హీరోలు ఇప్పటికీ ఇద్దరుముగ్గురున్నారు.
వారిలో నాగార్జున ముందున్నారు. ఆయన ఇప్పటికే హీరోగా వందకు చేరువయ్యారు. ప్రస్తుతం కూలీ, కుబేర సినిమాలతో నాగ్ బిజీగా ఉన్నారు. వాటి తర్వాత మైల్స్టోన్ మూవీపై దృష్టి పెట్టనున్నారాయన. తమిళంలో ‘నితమ్ వరు వానమ్’ అనే ప్రేమకథను తెరకెక్కించిన రా.కార్తీక్ అనే కుర్ర దర్శకుడు ఇటీవలే నాగార్జునకు ఓ కథ వినిపించాడట. పూర్తిస్థాయి కమర్షియల్ అంశాలతో ఉన్న ఆ కథ తన వందవ సినిమాకు కరెక్ట్ అని నాగ్ భావించినట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం.
ప్రస్తుతం బౌండ్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేసే పనిలో రా.కార్తీక్ ఉన్నాడట. అక్కినేని నాగార్జున వందవ సినిమా అంటే.. అభిమానులకు అది నిజంగా ప్రతిష్టాత్మకమైనది. పక్కాగా హిట్ అవ్వాల్సిందే. మరి రా.కార్తీక్ ఎలాంటి కథ రాశాడో, ఈ బరువైన బాధ్యతను ఎలా మోస్తాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.