Nagarjuna | సోషల్ మీడియాలో కొంతకాలంగా హీరో నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై ఇప్పటికే పలుమార్లు చర్చ జరగ్గా, తాజాగా ఈ విషయంపై నాగ చైతన్య తండ్రి, సీనియర్ నటుడు నాగార్జున మరోసారి స్పందించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో రిపోర్టర్లు ఇదే ప్రశ్నను నాగార్జునను అడగగా, ఆయన “సమయం వచ్చినప్పుడు మేమే చెబుతాం” అంటూ సమాధానం ఇచ్చారు. అయితే ఈ మాటలను తప్పుగా అర్థం చేసుకున్న కొంతమంది నెటిజన్లు, నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడనే వార్తలను మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ చేయడం ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి స్పందించిన నాగార్జున, ఈ రూమర్స్‌కు స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. తండ్రి కావడం, ఒక కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేది ఎవరికైనా చాలా స్పెషల్ మూమెంట్. అలాంటి విషయాలపై వార్తలు రాసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం మంచిది అని అన్నారు. శోభిత మా ఇంట్లో అడుగుపెట్టాక ఎంతో సంతోషం వచ్చింది. ఆమె చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆమెది. ఆమె రాకతో మా జీవితాలు సంతోషంతో కళకళలాడుతున్నాయి. తాతయ్యను చేసే గుడ్ న్యూస్ ఏదైనా ఉంటే మేమే స్వయంగా ప్రకటిస్తాం అని స్పష్టం చేశారు.నాగార్జున చేసిన ఈ వ్యాఖ్యలతో నాగ చైతన్య తండ్రి కాబోతున్నాడంటూ వస్తున్న వార్తలకు పూర్తిగా చెక్ పడినట్టైంది. ప్రస్తుతం నాగ చైతన్య, శోభిత తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు.
ఇక నాగ చైతన్య కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన ‘వృషకర్మ’ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. పీరియాడికల్ థ్రిల్లర్ జానర్లో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.