భారతీయ నటీనటుల పట్ల జపాన్ ప్రజలు ఎంతో ఆదరణ కనబరుస్తారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఎన్టీఆర్, రామ్‌చరణ్, ‘బాహుబలి’తో ప్రభాస్ కూడా జపాన్‌లో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ వరుసలో అగ్ర నటుడు నాగార్జున చేరారు.
నాగార్జున ప్రత్యేక పాత్ర పోషించిన హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ జపాన్‌లో మంచి విజయాన్ని సాధించింది. తాజా చిత్రం ‘కుబేర’ సైతం జపాన్‌లో ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో జపాన్‌లోని నాగార్జున అభిమానులు ఆయన్ని ‘నాగ్-సామ’ అనే పేరుతో పిలుచుకుంటున్నారు. జపాన్ భాషలో ‘సామ’ అంటే రాజవంశానికి చెందిన వ్యక్తి లేదా సమాజంలో గొప్ప గౌరవం కలిగిన వ్యక్తి అని అర్థం.
నాగార్జున పట్ల అభిమానాన్ని చూపడానికి వారు ఆ పదాన్ని ఎంచుకోవడం అక్కడి వారి ప్రేమకు నిదర్శనమని అంటున్నారు. ఇదిలా ఉండగా రజనీకాంత్ హీరోగా నాగార్జున ప్రతినాయకుడి పాత్రలో నటించిన ‘కూలీ’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రాన్ని జపాన్‌లో కూడా విడుదల చేయబోతున్నారు. దీంతో రజనీ-నాగ్ ద్వయం నటనతో జపాన్ ప్రేక్షకులు ఫిదా అవడం అభిమానులు ఖుషీగా ఉన్నారు.