Nagarjuna | టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌కు సిద్ధమవుతున్నాడా? తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే అక్కినేని నాగార్జునతో సినిమా దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి తన కెరీర్లో ఇప్పటికే పలువురు అగ్ర హీరోలతో కలిసి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించారు. ముఖ్యంగా సీనియర్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్‌లతో సినిమాలు చేసి విజయాలు సాధించారు. దీంతో టాలీవుడ్లో ఒకే తరం నలుగురు అగ్ర హీరోలతో పనిచేసే అరుదైన అవకాశానికి ఆయన మరింత చేరువయ్యారు.
గతంలో నాగార్జున-అనిల్ రావిపూడి కాంబినేషన్‌పై అనేక వార్తలు వచ్చినప్పటికీ అవి ప్రచారాలుగానే మిగిలిపోయాయి. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ కాంబినేషన్‌ను వార్తల్లోకి తెచ్చాయి. ఒక షో ప్రమోషన్స్ సందర్భంగా సీనియర్ నటి రాధ మాట్లాడుతూ,నేను చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలతో సినిమాలు చేశాను అని చెప్పగా, వెంటనే స్పందించిన అనిల్ రావిపూడి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌లతో తాను చేసిన సినిమాల పేర్లను ప్రస్తావించారు. అనంతరం “నాగార్జున గారితో మనం త్వరలో తీయబోతున్నాం” అని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ మాటలే ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నారు. మరోవైపు నాగార్జున కూడా తన ప్రతిష్టాత్మక 100వ సినిమాను ఓ ప్రముఖ తమిళ దర్శకుడితో చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత నాగార్జున-అనిల్ రావిపూడి కాంబినేషన్ పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.తాజా సమాచారం ప్రకారం, నాగార్జున 101వ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ సినిమాను 2028 సంక్రాంతి కానుకగా విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ప్రాజెక్ట్ నిజమైతే అనిల్ రావిపూడి ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి నాలుగు సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన ఈ తరం దర్శకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందుతారు.