Naga Durga | ఫోక్ సాంగ్స్, డ్యాన్స్ ప్రదర్శనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్గా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. ఇడుపు కాయితం చిత్రంతో వెండితెరకు పరిచయం అవుతున్న ఆమె పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తుండగా, ప్రియదర్శి హీరోగా నటిస్తున్నారు. ఇందులో నాగదుర్గ ‘శ్రీలత’ అనే తెలంగాణ యువతి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచగా, ‘ఇడుపు కాయితం’ టైటిల్ కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నాగదుర్గ వరుస ఇంటర్వ్యూలతో ప్రేక్షకులకు మరింత చేరువవుతోంది.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగదుర్గ, తనకు బిగ్ బాస్ తెలుగు నుంచి ఆఫర్ వచ్చిన మాట నిజమేనని వెల్లడించింది. అయితే తాను ఆ షోకు సరిపోనని భావించి ఆ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పింది.నాకు భయం అనేది లేదు. కానీ బిగ్‌బాస్ షోకు నేను సెట్ కాను అనిపించింది. నేను చాలా సైలెంట్‌గా ఉంటాను. మొహమాటం ఎక్కువ. ఎవరికైనా ‘నో’ చెప్పాలన్నా చాలా ఇబ్బంది పడతాను. నా భావాల కంటే ఎదుటివారి భావాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. అదే కొన్ని సందర్భాల్లో నాకు సమస్యగా మారుతుంది. కొన్నిసార్లు ఎదుటివారిని బాధ పెట్టకూడదనే ఆలోచనతో నేనే బాధపడుతూ ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి” అని నాగదుర్గ చెప్పింది.
బిగ్‌బాస్ ఆఫర్ వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు ఇచ్చిన సలహాల గురించి కూడా నాగదుర్గ ఆసక్తికర విషయాలు పంచుకుంది. అమ్మ నాతో.. నువ్వు చిన్న విషయానికే ఇంత ఎమోషనల్ అవుతావు. బిగ్‌బాస్ హౌస్‌లో జరిగే పరిస్థితులను ఎలా తట్టుకుంటావో ఆలోచించు అని చెప్పింది. కానీ నాన్న మాత్రం కనీసం రెండు మూడు వారాలైనా హౌస్‌లో ఉంటే టెలివిజన్ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతావని సూచించారు అని తెలిపింది. అయితే ప్రస్తుతం తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని నాగదుర్గ స్పష్టం చేసింది. హీరోయిన్గా మంచి అవకాశాలు అందుకోవాలనుకుంటున్నాను. ఒకేసారి రెండు విషయాలపై దృష్టి పెట్టి ఏదీ సరిగా చేయలేనని అనిపించింది. అందుకే బిగ్‌బాస్ ఆఫర్‌ను గౌరవంగా తిరస్కరించాను అని వెల్లడించింది. గతంలో శ్యామ్ సింగ రాయ్, బ్రో వంటి చిత్రాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ, నాట్యంపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో వాటిని తిరస్కరించినట్లు ప్రచారం జరిగింది.