నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సినిమా ‘థాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. ఈ నెల 22న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ…’ఈ కథ మేం అనుకున్నట్లు రూపొందించడానికి ప్రధాన కారణం మా సాంకేతిక నిపుణులు. వాళ్ల ఒక జట్టుగా పనిచేసినందు వల్లే ఇంత బాగా సినిమా వచ్చింది. మా టీమ్ అందరికీ థాంక్స్’ అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…చిత్ర పరిశ్రమలోకి రాకముందు నుంచీ నాకు విశాఖతో అనుబంధం ఉంది.
హైదరాబాద్ తర్వాత ఎక్కువ షూటింగ్స్, ప్రచార కార్యక్రమాలు ఇక్కడే చేస్తుంటాం. అక్కినేని అభిమానులు ఈ నెల 22 దాకా మీ ఉత్సాహాన్ని అలాగే ఉంచండి, సినిమా చూశాక మీరు చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఈ చిత్ర కథను రచయిత బీవీఎస్ రవి చెప్పినప్పుడు బాగా నచ్చింది. దీన్ని ఒక జర్నీలా చూపించాలి, ఆ ప్రయాణం మనసును తాకేలా ఉండాలి అనేది చర్చించాం. ఇందులో అందమైన ప్రేమ కథను చూస్తారు. మూడు వేరియేషన్స్ లో చైతూ పాత్ర ఆకట్టుకునేలా ఉంటుంది. దర్శకుడు విక్రమ్ ప్రతిభావంతంగా సినిమా తెరకెక్కించాడు. నా జీవితమే ఉదాహారణగా తీసుకుంటే ఎంతోమంది మా సంస్థ అభివృద్ధికి, మా ఎదుగుదలకు ఉపయోగపడ్డారు.
వాళ్లందరికీ థాంక్స్ చెప్పాలి. అలాగే మా అమ్మా నాన్న, కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇలా ఈ జాబితాలో ఎంతోమంది ఉంటారు. మా సంస్థను చేయిపట్టి నడిపించిన స్టార్ హీరోలు అందరికీ థాంక్స్. అన్నారు. హీరో నాగ చైతన్య మాట్లాడుతూ…తాతగారు, నాన్నను చూసి నటుడిని అయ్యాను. కానీ ఇవాళ నేను ప్రతి సినిమా ఇంత జాగ్రత్తగా, కష్టపడి చేస్తున్నానంటే కారణం మీ అభిమానం, మీరు నాపై పెట్టుకునే అంచనాలే. మా కేరాఫ్ అడ్రస్ అభిమానులే అని చెబుతాను. మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోతే, మనం చేరుకున్న గమ్యానికి విలువ ఉండదు అని ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది.
అది చెప్పినప్పుడు నాకు వైజాగ్ గుర్తొచ్చింది. విశాఖతో నాకున్న అనుబంధం అలాంటిది. నా కెరీర్ విజయంలో ఈ ప్రాంతానికి పాత్ర ఉంది. ఇక్కడ షూటింగ్ చేసిన నా ప్రతి సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. మనం కృతజ్ఞతగా ఉండాలనే మంచి విషయం ఈ సినిమా ద్వారా తెలుసుకున్నా. సినిమా చూసినప్పుడు మీకూ అదే అనుభూతి కలుగుతుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు థమన్, కథా రచయిత బీవీఎస్ రవి తదితరులు పాల్గొన్నారు.