‘తండేల్’ బ్లాక్బస్టర్ సక్సెస్తో జోష్మీదున్నారు నాగచైతన్య. ఆయన కెరీర్లో వందకోట్ల వసూళ్ల మైలురాయిని దాటిన తొలి చిత్రమిది. ప్రస్తుతం చైతూ ట్రెజర్ హంట్ నేపథ్యంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నది. ఇదిలావుండగా నాగచైతన్య తదుపరి చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికొచ్చింది.
తమిళ దర్శకుడు ‘సర్దార్’ ఫేమ్ పీఎస్ మిత్రన్తో నాగచైతన్య సినిమా దాదాపుగా ఖరారైందట. గూఢచారి నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ కథాంశమిదని, ఇటీవలే కథా చర్చలు కూడా పూర్తయ్యాయని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం కార్తీతో ‘సర్దార్-2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు పీఎస్ మిత్రన్. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన నాగచైతన్య ప్రాజెక్ట్ను టేకాఫ్ చేస్తారని తమిళ మీడియాలో కూడా వినిపిస్తున్నది.