Mysore Sandal Brand Controversy | మైసూరు శాండల్ సబ్బులు, శ్రీ గంధం ఉత్పత్తులకు నటి తమన్నా భాటియాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై కర్ణాటకలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తమన్నాకు కన్నడ భాష తెలియదని, కర్ణాటక సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన లేని వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం సరికాదని ప్రజలు, ప్రజాప్రతినిధులు, కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మైసూరు పార్లమెంట్ సభ్యుడు కృష్ణదత్త ఒడయార్ ఈ నియామకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పూర్వీకుడు కృష్ణరాజు ఒడయార్ 1916లో స్థాపించిన చారిత్రక మైసూరు కంపెనీకి పరభాష నటులను అంబాసిడర్‌గా నియమించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇది రాష్ట్ర గుర్తింపును, సాంస్కృతిక వారసత్వాన్ని అగౌరవపరచడమేనని ఆయన ఆరోపించారు.
మరోవైపు తమన్నాకు బ్రాండ్ అంబాసిడర్‌గా రూ. 6.2 కోట్లు చెల్లించడంపైనా కర్ణాటక ప్రజలు మండిపడుతున్నారు. కన్నడ భాష రాని, కర్ణాటక సంస్కృతి తెలియని వారికి ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించడంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. రాష్ట్రంలో ఎందరో సమర్థులైన కన్నడ నటీనటులు ఉండగా, వేరే భాష నటిని ఎందుకు ఎంపిక చేశారని సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది.
మైసూరు శాండల్ సబ్బులకు ఇప్పటికే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉందని, ఎలాంటి సెలబ్రిటీ ప్రచారం లేకుండానే రూ. 400 కోట్లకు పైగా లాభాలు ఆర్జిస్తున్న కంపెనీకి ఇంత పెద్ద మొత్తాన్ని వెచ్చించి బ్రాండ్ అంబాసిడర్‌ను నియమించాల్సిన అవసరం ఏముందని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
ఈ వివాదంపై కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్ స్పందించారు. మైసూరు శాండల్ బ్రాండ్‌ను దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా విస్తరించే లక్ష్యంతోనే తమన్నాను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. తమన్నాకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉందని, ఆమె ద్వారా బ్రాండ్ మరింత విస్తరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక నటీమణులను కూడా పరిశీలించామని, అయితే వివిధ కారణాల వల్ల తమన్నాను ఎంపిక చేయాల్సి వచ్చిందని మంత్రి వివరణ ఇచ్చారు. అయితే, ఈ వివరణపై కన్నడ సంఘాలు, విపక్షాలు సంతృప్తి చెందడం లేదు. తమన్నా నియామకాన్ని రద్దు చేసి, కన్నడ నటిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి.