TN Elections 2026 | తమిళ నటి అక్షయ హరిహరన్ తన ఓటు హక్కు విషయంలో జరిగిన అన్యాయంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా గురువారం చెన్నైలోని అడయార్ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆమెకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఓటును ఎవరో అప్పటికే వేసినట్లు అధికారులు తెలపడంతో ఆమె షాక్కు గురయ్యారు. ఓటరు జాబితాలో పేరు, తండ్రి పేరు వంటి వివరాలన్నీ సరిగ్గా ఉన్నప్పటికీ, తన ఫోటో స్థానంలో వేరే మహిళ ఫోటో ఉండటం చూసి ఆమె విస్మయం చెందారు.
దీనిపై పోలింగ్ అధికారులను నిలదీసిన అక్షయ, తన హక్కును మరొకరు ఎలా వినియోగిస్తారని ప్రశ్నించారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తీవ్ర నిరాశ వ్యక్తం చేసిన ఆమె, పట్టుబట్టి సెక్షన్ 49P ప్రకారం ‘టెండర్డ్ ఓటు’ వేశారు. ఈ విధానంలో ఈవీఎంలో కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసి సీలు చేసిన కవరులో అందజేస్తారు. చట్టపరంగా తన ఓటును నమోదు చేసినప్పటికీ, నేరుగా మిషన్లో ఓటు వేసినంత సంతృప్తి కలగలేదని ఆమె పేర్కొన్నారు. ఇటీవల ‘రంగోలి’ సినిమాతో గుర్తింపు పొందిన అక్షయ, ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, తన ఓటును దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్షయ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
@ECISVEEP please spread the news and cast your ballot tender vote if this is the case and cancel the fake vote with a complaint pic.twitter.com/eu5xkYB1k9
— akshaya hariharan (@akshaya__31) April 23, 2026