ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘మై డియర్ భూతం’. ఈ చిత్రంలో ఆయన జీని పాత్రలో కనిపించనున్నారు. రమ్య నంబీశన్, సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్. రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏఎన్ బాలాజీ ఈ నెల 15న తెలుగులో విడుదల చేస్తున్నారు. ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్కు ప్రాధాన్యత ఉండనుంది. తాజాగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రభుదేవా మాట్లాడుతూ…‘నన్ను ప్రోత్సహించి, పేరొచ్చేలా చేసింది తెలుగు చిత్ర పరిశ్రమనే. అందుకే టాలీవుడ్ అంటే నాకు ప్రత్యేక అభిమానం. ఈ సినిమాతో ఒక మంచి ప్రయత్నం చేశాం. పిల్లలను, పెద్దలను అందరినీ ఆకట్టుకునే సినిమా అవుతుంది’ అన్నారు. దర్శకుడు ఎన్ రాఘవన్ మాట్లాడుతూ..‘ప్రభుదేవా కోసమే రాసిన స్క్రిప్టు ఇది. ఈ కథకు అంతగా సరిపోయారాయన. ప్రభుదేవా ఈ చిత్రం కోసం 45 రోజులు కష్టపడ్డారు. ఆయన కష్టం రేపు తెరపై చూస్తారు. జీని పాత్రలా మారిపోయారు. మిమ్మల్ని నవ్వించి, ఆశ్చర్యపరిచే అంశాలు ఇందులో ఉంటాయి’ అన్నారు.