My baby Movie | ఇటీవల తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన ‘DNA’ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాత సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని ‘మై బేబి’ పేరుతో ఈనెల జూలై 18న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. నెల్సన్ వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిమిషా సజయన్, అథర్వ మురళి కీలక పాత్రల్లో నటించారు. గతంలో ‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’, ‘పిజ్జా’ వంటి విజయవంతమైన అనువాద చిత్రాలను అందించిన సురేష్ కొండేటి, ‘మై బేబి’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా విడుదలకు ఒక్కరోజే ఉండడంతో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. హాస్పిటల్ మాఫియా ఆధారంగా తెరకెక్కినట్లు తెలుస్తుంది. ఈ చిత్రం ఆనంద్ (అథర్వ), దివ్య (నిమిషా సజయన్) అనే జంట చుట్టూ తిరుగుతుంది. ఆనంద్ తన లవ్ ఫెయిల్ అవ్వడం వలన మందుకి బానిసగా మారతాడు. దివ్య బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటుంది. వీరిద్దరికి అనుకోకుండా పెళ్లి జరుగుతుంది. అయితే ఆనంద్ దివ్య మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని, ఆమెను ప్రేమిస్తాడు. వారిద్దరూ సంతోషంగా జీవిస్తారు.
ఈ క్రమంలోనే దివ్య గర్భవతి అవుతుంది, వారికి ఒక బాబు పుడతాడు. అయితే, బిడ్డ పుట్టిన కొన్ని నిమిషాలకే, ఆ బిడ్డ తమది కాదని, ఎవరో ఆసుపత్రిలో మార్చేశారని దివ్య పదేపదే చెబుతుంది. ఆమె మానసిక స్థితి కారణంగా మొదట ఎవరూ ఆమె మాటలు నమ్మరు. కానీ ఆనంద్ తన భార్య మాటలను నమ్మి, నిజం తెలుసుకోవడానికి బయలుదేరతాడు. ఆనంద్ తన బిడ్డను కనుగొనడానికి వెళ్లిన క్రమంలో పిల్లలను కిడ్నాప్ చేసి అమ్ముకునే ఒక పెద్ద నెట్‌వర్క్‌ను కనుగొంటాడు. అయితే ఈ నెట్వర్క్ని నడిపిస్తుంది ఎవరు. ఆనంద్ ఈ నెట్వర్క్ని ఎలా కనిపెట్టాడు. దివ్య తనకి పుట్టిన బిడ్డని మార్చేశారు అని ఎలా తెలుసుకుంటుంది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.