Muthayya Teaser | గతంతో పొలిస్తే ఇప్పుడు టాలీవుడ్లో కంటెంట్ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది. ప్రేక్షకాదరణ కూడా విపరీతంగా పెరుగుతుంది. కంటెంట్ ఉంటే చాలు పేరున్న కథానాయకులతో పనిలేదు అని చాలా సినిమాలు ఇప్పటికే నిరూపించాయి. ‘కెరాఫ్ కంచెరపాలం’, ‘రాజావారు రాణిగారు’, ‘సినిమా బండి’ వంటి సినిమాలు అలానే ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి ప్రేక్షకాదరణను పొందాయి. ఈ క్రమంలోనే మరో కంటెంట్ ఉన్న కథ ప్రేక్షకుల ముందుకు రానుంది. కె. సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘ముత్తయ్య’. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను నాచ్యురల్ స్టార్ నాని తాజాగా విడుదల చేశాడు.
నాని టీజర్‌ను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ నాకు 24ఏళ్ళ వయసులో అష్టాచమ్మా సినిమాలో అవకాశం రాకపోతే 70ఏళ్ళకు నేను ముత్తయ్య లాగే అయ్యేవాడిని. టీజర్ మనసుకు హత్తుకుంది అని తెలిపారు. ఇక తాజాగా విడుదలైన ఈ టీజర్ ఆధ్యాంతం ఆకట్టుకుంటుంటుంది. జీవితంలో ఒక్కసినిమాలోనైనా నటించాలనే ఆశతో ఉన్న ముత్తయ్య పాత్రలో సుధాకర్ రెడ్డి అద్భుతంగా నటించాడు. ‘పానమంత పీక్తది సినిమా సినిమా అని పొద్దున లేస్తే.. ఒక్కసారి పరద మీద కనిపించి సచ్చిపోయినా పర్లేదురా’ అంటూ వచ్చే డైలాగ్ ముత్తయ్యకు సినిమా అంటే ఎంత పిచ్చో తెలుస్తుంది. ‘ఏదైనా కోరికుంటే దాన్ని వెంటనే తీర్చు కోవాలి, లేకపోతే అడనే బొంద పెట్టి రావాలి.. నాలాగా వెంబడ పెట్టుకొని తిరగద్దు’ అంటూ వచ్చే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. కార్తీక్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. దివాకర్ మని సినిమాటోగ్రఫి బాగుంది. ఫిక్షనరీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని వ్రింద ప్రసాద్ నిర్మించాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది.