సైబీరియా: రష్యాలోని సైబీరియా ప్రాంతంలో 28 ఏళ్ల ల్యాబ్ టెక్నీషియన్ ప్లేగు(Plague) వ్యాధితో మరణించింది. ఈ ఘటన నేపథ్యంలో సమీపంలో ఉన్న అయిదు ఆస్పత్రులను మూసివేశారు. వందలాది మందిని క్వారెంటైన్ చేశారు. షెలికోవ్లో ఉన్న యాంటీ ప్లేగ్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న టెక్నీషియన్ ప్లేగు వల్ల మృతిచెందింది. ఆమెను దర్యా షిపిలోవాగా గుర్తించారు. న్యూమోనియా ప్లేగు ఆమెకు సోకినట్లు భావిస్తున్నారు. ఆ వ్యాధి చాలా తీవ్రంగా ప్రబలుతుంది. ఒకవేళ ముందుగా చికిత్స చేయకుంటే అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ల్యాబ్‌లో టెస్టింగ్ కోసం బ్యాక్టీరియాను సేకరిస్తున్న సమయంలో ఓ టెస్ట్‌ట్యూబ్ పగిలిపోయిందని, దాని వల్ల ఆ బ్యాక్టీరియా సోకి ఉంటుందని ఆమె తమ మెడికల్ స్టాఫ్‌కు చెప్పింది.
సెప్టెంబర్ 29వ తేదీన ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్రమైన న్యూమోనియా లక్షణాలతో ఆమె ప్రాణాలు విడిచింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందిన ఆమె అక్టోబర్ 1వ తేదీన చనిపోయింది. ఆమెతో కాంటాక్టులో ఉన్న సుమారు 200 మందిని క్వారెంటైన్లో పెట్టారు. ఇర్కుస్కీలో అనేక పబ్లిక్ కార్యక్రమాలను రద్దు చేశారు. చాలా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ సోకినట్లు ఇర్కుస్కీ గవర్నర్ ఇగర్ కోబ్జేవ్ తెలిపారు. న్యూమోనియా లక్షణాలతో ఉన్న గుర్తు తెలియని వ్యాధి ప్రబలినట్లు అనుమానిస్తున్నారు. ప్లేగ్ ఇన్స్టిట్యూట్లో మరెవరికీ వ్యాధి సోకలేదని ఆయన చెప్పారు.