Multi Starrer | మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఈ కాంబినేషన్ గురించి ఎప్పటి నుంచో అభిమానుల్లో ఆసక్తి ఉంది. అయితే గతంలో బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రయాణం వేడుకల సందర్భంగా చిరంజీవి స్వయంగా దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఓ సవాల్ విసరడంతో ఈ కలయికపై ఒక్కసారిగా చర్చ మొదలైంది. చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఓ సినిమా చేయాలని బోయపాటిని కోరడంతో.. ఈ మల్టీస్టారర్ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను.. ఈ ప్రతిష్టాత్మక కాంబినేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, బాలకృష్ణలను కలిపి సినిమా చేయాలనే ఆలోచన కచ్చితంగా కార్యరూపం దాల్చాల్సిన విషయమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలుగు సినిమా రంగానికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు నాలుగు స్తంభాల్లాంటి వారని బోయపాటి శ్రీను పేర్కొన్నారు. అలాంటి ఇద్దరు దిగ్గజ హీరోలు చిరంజీవి, బాలకృష్ణలను ఒకే సినిమాలో చూపించే అవకాశం తనకు వస్తే అది ఎంతో ప్రత్యేకమైన విషయమని అన్నారు. ఇద్దరితో కలిసి సినిమా చేయడం సాధారణ ప్రాజెక్ట్‌లా ఉండదని, పూర్తిగా మరో స్థాయిలో ఉంటుందని బోయపాటి అభిప్రాయపడ్డారు. ఈ కాంబినేషన్ గురించి అభిమానుల్లో ఉన్న ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని చూస్తే.. బోయపాటి వ్యాఖ్యలు మరోసారి ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే చిరంజీవి, బాలకృష్ణలను ఒకే సినిమాలోకి తీసుకురావడం అంత సులభమైన విషయం కాదని కూడా బోయపాటి తెలిపారు. ఇద్దరు హీరోల కాల్షీట్లు, కథ, పాత్రల ప్రాధాన్యత, ఇతర బాధ్యతలు వంటి ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని పక్కా ప్రణాళిక అవసరమని చెప్పారు.
అందువల్ల కేవలం ఆలోచన ఉండటం సరిపోదని, ఇద్దరు అగ్ర కథానాయకులకు సరిపోయే కథ సిద్ధం చేయడంతో పాటు.. వారి తేదీలు కూడా కలిసేలా చూసుకోవాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. చిరంజీవి, బాలకృష్ణలను ఒకే ఫ్రేమ్‌లో చూడాలన్నది ఇరు హీరోల అభిమానుల చిరకాల కోరిక. గతంలో ఈ ఇద్దరు పలు సందర్భాల్లో కలిసి కనిపించినప్పటికీ.. ఒకే సినిమాలో హీరోలుగా నటించడం మాత్రం జరగలేదు. ఇప్పుడు బోయపాటి శ్రీను చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ ఆలోచన మరోసారి చర్చలోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ప్రస్తుతానికి ఈ ఆలోచన, చర్చల దశలోనే ఉందని చెప్పాలి. ప్రస్తుతం చిరంజీవి ‘కాకా’ సినిమాతో బిజీగా ఉండగా.. బాలకృష్ణ ‘దాదా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత భవిష్యత్తులో చిరంజీవి–బాలకృష్ణ కాంబినేషన్ సాధ్యమవుతుందా? అనేది చూడాలి.