తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. గుండెపోటుతో సంగీత దర్శకుడు రాజ్ (68) హైదరాబాద్ కూకట్‌పల్లిలోని స్వగృహంలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అలనాటి సంగీత దర్శకుడు టీవీ రాజు కుమారుడైన రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ఆయన స్వస్థలం రాజమండ్రి దగ్గరలోని రఘుదేవపురం. మద్రాసులో 1954, జూలై 27న రాజ్ జన్మించారు. రాజ్ కోటి ద్వయంలో రాజ్ ఒకరు. కమర్షియల్ సినిమా సంగీతానికి చిరునామాగా పేరు తెచ్చుకున్న వీరిద్దరు కలిసి దాదాపు 400 చిత్రాలకు సంగీతాన్ని అందించారు. హిందీ సహా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సంగీత దర్శకత్వం వహించారు. కోటితో కలిసి సినిమా పాటకు కొత్త బీట్‌ను పరిచయం చేసిన ఘనత రాజ్‌కు దక్కుతుంది. సంగీత రంగంలో తండ్రి అడుగుజాడల్లో నడిచిన రాజ్ ప్రముఖ సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర సహాయకుడిగా 8 ఏండ్ల పాటు పనిచేశారు. అక్కడే రాజ్‌కు సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు కుమారుడు కోటేశ్వరరావు(కోటి)తో పరిచయం అయ్యింది.
వీరిద్దరూ గిటారిస్టులుగా చక్రవర్తి దగ్గర పనిచేశారు. 1983లో సంగీత దర్శకులుగా మారి ‘ప్రళయగర్జన’ చిత్రానికి పనిచేశారు. శోభన్ బాబు నటించిన ‘సంసారం’ సినిమా విజయం వీరి కెరీర్‌కు బ్రేక్‌నిచ్చింది. అనతికాలంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన యువ సంగీత దర్శకులుగా పేరు తెచ్చుకున్నారు రాజ్ కోటి. సినిమా పాటలో అనేక ప్రయోగాలు చేశారు. ‘యముడికి మొగుడు’, ‘లంకేశ్వరుడు’, ‘ముఠామేస్త్రి’, ‘సీతారత్నం గారి అబ్బాయి’, ‘ఏవండీ ఆవిడ వచ్చింది’. ‘హలో బ్రదర్’ వంటి అనేక మ్యూజికల్ హిట్స్ ఇచ్చారు రాజ్ కోటి. వీరు చేసిన పాటల్లో పదహారేళ్ల వయసు (లంకేశ్వరుడు), వానజల్లు గిల్లుతుంటే (యముడికి మొగుడు), గజ్జె ఘల్లుమన్నదో (బావా బావమరిది), అందమా అందుమా (గోవింద గోవింద), మేఘమా మరువకే (సీతారత్నం గారి అబ్బాయి) వంటివి కాలదోషం పట్టకుండా ఇప్పటికీ శ్రోతలను అలరిస్తున్నాయి.
రాజ్ మృతి చెందారన్న వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. మిత్రులను విడదీసిన చెప్పుడు మాటలు దాదాపు రెండు దశాబ్దాల పాటు కలిసి పనిచేసిన రాజ్-కోటి సంగీత ద్వయం తర్వాత విడిపోయి ఎవరికి వారు కెరీర్ కొనసాగించారు. తమ మధ్య కొందరు చెప్పుడు మాటలతో దూరాన్ని పెంచారని, వారి మాటలు వినే రాజ్ తన నుంచి విడిపోయారని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కోటి తెలిపారు. కోటితో విడిపోయిన తర్వాత రాజ్ ‘సిసింద్రీ’, ‘రాముడొచ్చాడు’ వంటి చిత్రాలకు పనిచేశారు. తమిళ, కన్నడలో కలిసి దాదాపు 70 చిత్రాలకు రాజ్ సంగీతాన్ని అందించారు. కొన్ని చిత్రాల్లో నటుడిగానూ ప్రతిభ చాటారు. టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
దిగ్భ్రాంతికి గురయ్యా – కోటి
రాజ్ భౌతికంగా దూరమవడం నా జీవితంలో పూడ్చలేని లోటు. ఆయనకు గత కొద్దికాలంగా ఆరోగ్యం బాగాలేదని తెలుసు. కానీ ఇలా హఠాత్తుగా వదిలి వెళ్లిపోతారని అనుకోలేదు. మేం ఇద్దరం కలిసి ఎన్నో చిత్రాలకు సంగీతాన్ని అందించాం. రాత్రీ పగలూ కష్టపడి పేరు తెచ్చుకున్నాం. ట్రెండింగ్ మ్యూజిక్ చేశాం. మేం విడిపోవడం కాలమహిమ. అందులో ఎవరి తప్పూ లేదు. కోటిగా నేను సినిమాలు చేసినా ఆ పాటలు రాజ్ కోటివే. ఒకరి మీద మరొకరికి ఉన్న ప్రభావం అది. ఇప్పటికీ నన్ను రాజ్ కోటిగా పిలిచేవారున్నారు. మా పాటలు ఉన్నంత కాలం రాజ్ బతికే ఉంటారు.