Ektaa Kapoor | బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్, ఆమె తల్లి శోభాకపూర్లను ముంబయి పోలీసులు మంగళవారం ప్రశ్నించారు. ఆల్ట్ బాలాజీ వెబ్ సిరీస్ ‘గంధీభాత్’ ఎపిసోడ్లో మైనర్ బాలికలపై అసభ్యకరమైన సీన్స్‌ను చిత్రీకరించినందుకు ఏక్తా కపూర్‌తోపాటు ఆమె తల్లి శోభపై పోక్సో చట్టం కింద కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు విచారించారు. ఈ నెల 24న మరోసారి విచారణకు రావాలని ముంబయి పోలీసులు ఆదేశించారు. ఆల్ట్ బాలాజీ టెలిఫిల్మ్ లిమిటెడ్‌కు చెందిన ఏక్తా కపూర్‌తో పాటు ఆమె తల్లి శోభా కపూర్‌పై ఈ నెల 20న ముంబయిలో ఎంబీహెచ్ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 295ఏ, ఐటీచట్టంతో పాటు పోక్సోచట్టంలో సెక్షన్ 13, సెక్షన్ 15 కింద మైనర్లపై అశ్లీల దృశ్యాలను చిత్రీకరించారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోక్సో నిబంధనలు ఉల్లంఘించే సన్నివేశాలు ఉన్నాయన్నారు. అయితే, ఈ వివాదాస్పద ఎపిసోడ్‌ని యాప్‌లో స్ట్రీమింగ్ నుంచి తొలగించారు. గొప్ప వ్యక్తులతో పాటు సాధువులను సైతం అవమానించారని, దాంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. పోక్సోతో పాటు సమాచార సాంకేతిక చట్టం-2000, మహిళా నిషేధ చట్టం 1986, పొగాకు ఉత్పత్తుల చట్టం-2003 తదితర చట్టాలను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసులు పోక్సో చట్టంలో సెక్షన్ 13, సెక్షన్ 15, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 – 67 (A), బీఎన్ఎస్ సెక్షన్ 295 (A)తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే సోషల్ మీడియాలో ‘బ్యాన్ ఆల్ట్ బాలాజీ’ హ్యాష్‌ట్యాగ్ ‘ఎక్స్’లో ట్రెండ్ అవుతున్నది.