MSG Collections |మెగాస్టార్ చిరంజీవి పేరు పోస్టర్‌పై పడితే చాలు… థియేటర్లలో పండగ వాతావరణం ఎలా ఉంటుందో మరోసారి నిరూపించింది తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సోమవారం (జనవరి 12) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా, మొదటి షో నుంచే ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టించింది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత చిరంజీవి నటించిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్రేడ్‌మార్క్ ఎంటర్టైన్మెంట్ను ఈ సినిమాకు పునాదిగా తీసుకొని, కామెడీ–ఎమోషన్–మెసేజ్ అన్నీ బ్యాలెన్స్ అయ్యేలా కథను నడిపించారు. చిరంజీవి నుంచి అభిమానులు ఆశించే డాన్స్ స్టెప్స్, పంచ్ డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ సినిమాలో పుష్కలంగా కనిపించడంతో మెగా ఫ్యాన్స్ థియేటర్లలో సంబరాలు చేస్తున్నారు.
విడుదలైన రోజే సినిమా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రీమియర్లు, ఫస్ట్ డే కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది చిరంజీవి కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్గా నిలవడం విశేషం. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, మెగా అభిమానులు సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటించి కీలక పాత్రలో మెప్పించింది. అలాగే విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించడం సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. కేథరిన్, జరీనా వహాబ్, హర్షవర్ధన్, అభినవ్ గోమటం వంటి నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో మంచి స్పందన పొందుతున్నాయి. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం… చిరంజీవి స్టార్ పవర్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్, పండగ సీజన్ కలిసిరావడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో నిలబడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే హౌస్‌ఫుల్ షోస్‌తో థియేటర్లు కళకళలాడుతుండగా, వచ్చే రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిరంజీవి అభిమానులకు మాత్రమే కాదు, కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు కూడా పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా నిలుస్తూ సంక్రాంతి రేసులో దూసుకెళ్తోంది.