Mrunal Thakur | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రాబోతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ (Peddi) గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన ఒక అదిరిపోయే మాస్ మసాలా స్పెషల్ సాంగ్‌లో మెరిసేందుకు టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కేవలం ఈ ఒక్క పాట కోసమే మేకర్స్ ఆమెకు సుమారు రూ. 4 కోట్ల భారీ రెమ్యూనరేషన్‌ను ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఇప్పటికే ఈ సాంగ్ కోసం ఒక పక్కా మాస్ బీట్‌ను సిద్ధం చేయగా, చరణ్ లాంటి మేటి డాన్సర్‌తో మృణాల్ చేసే డాన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. గతంలో ఈ పాట కోసం శ్రీలీల, పూజా హెగ్డే వంటి పేర్లు వినిపించినా, చివరికి మృణాల్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ స్పెషల్ సాంగ్ అప్డేట్పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాను 2026 మార్చిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది.