వ్యవసాయం అవశ్యకతను నేటి తరానికి తెలియజేస్తూ సందేశాత్మక కథాంశంతో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ చిత్రాన్ని రూపొందించామని చెప్పారు చిత్ర హీరో త్రిగుణ్. మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరవింద్ మండెం నిర్మించారు. పాయల్ రాధాకృష్ణ, అనీష్ కురువిల్లా ఇతర ప్రధాన పాత్రధారులు. ఆదివారం టీజర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా త్రిగుణ్ మాట్లాడుతూ…నవతరం యువత జీవనశైలిని చూపిస్తూనే వ్యవసాయం గొప్పదనాన్ని ఈ చిత్రంలో చర్చించామన్నారు. వ్యవసాయం చేసే విధానంలో మార్పు రావాలనే అంశాన్ని చర్చిస్తూ మెసేజ్ ఓరియెంటెడ్‌గా సినిమా తీశామని దర్శకుడు మధుదీప్ పేర్కొన్నారు. వినోదంతో పాటు అద్భుతమైన సందేశం కలబోసిన చిత్రమిదని నిర్మాత అరవింద్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రకాష్ చెరుకూరి, దర్శకత్వం: మధుదీప్ చెలికాని.