Mother’s Day | మన జీవితానికి రూపమిచ్చే కథా రచయిత్రి, మనల్ని ముందుకు నడిపించే దిగ్దర్శకురాలు, మన భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దే ఆర్ట్ డైరెక్టర్, మన ఆకలి తెలిసిన నిర్మాత, మనకు భాష నేర్పే డైలాగ్ రైటర్, మనతో అడుగులు వేయించే డాన్స్ మాస్టర్, మన తప్పులు సరిదిద్దే ఎడిటర్, వందరోజుల సినిమాలా.. మనం వందేండ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించే మనసున్న ప్రేక్షకురాలు.. అమ్మ! ప్రతి మనిషి వెనుక అమ్మ ఉన్నట్టు.. ప్రతి మంచి సినిమా విజయం వెనుకా ఓ కన్నతల్లి పాత్ర ఉండితీరుతుంది. అమ్మ ప్రేమకు ప్రతినిధిగా.. అచ్చంగా మన అమ్మలానే సంభాషిస్తుంది. మాతృ దినోత్సవం సందర్భంగా ఆ వెండితెర తల్లికి వేవేల వందనాలు.
అమ్మ గురించి ఎవరెంత చెప్పినా.. చెప్పాల్సింది ఇంకా మిగిలే ఉంటుంది. అదీ.. అమ్మ గొప్పతనం. వెండితెర సైతం విజయాల కోసం అమ్మ పాదాలను ఆశ్రయించిన ఘట్టాలు అనేకం. ఇక మాటల రచయితలకైతే అమ్మ పాత్ర ఓ వరం. అమ్మతో ఏం చెప్పించినా చప్పట్లు మారుమోగాల్సిందే. అమ్మ గురించి ఎవరు మాట్లాడినా థియేటర్లో ఉద్వేగాలు ప్రవహించాల్సిందే.
‘వేరేవాళ్ల గురించి ఆలోచించొద్దు.. వాళ్లెవరూ నీకంటే గొప్పవాళ్లు కాదు.. ప్రపంచంలో తల్లిని మించిన యోధులెవరూ లేరు’.. రోడ్డు మీద పసిపాపతోపాటు కింద పడిపోతున్న తల్లికి చేయూతనిస్తూ ‘కేజీఎఫ్’లో రాఖీభాయ్ చెప్పే ఈ డైలాగ్ థియేటర్లలో ఈలలు వేయించింది. ఇదే సినిమాలో ‘వెన్నంటి వేలమంది ఉన్నారనే ధైర్యం నీకుంటే, ఒక యుద్ధాన్ని గెలవొచ్చు. అదే వేలమందికి నువ్వున్నావన్న ధైర్యం ఉంటే.. ప్రపంచాన్ని గెలవొచ్చు’ ఓడిపోతున్నా అని కుంగిపోతున్న కొడుకులో ధైర్యం నింపుతూ అమ్మ చెప్పిన మాట స్ఫూర్తి మంత్రమే అవుతుంది. ‘నిన్ను కనడానికి అమ్మ కావాలి.. నిన్ను కొనడానికి భార్య కావాలి.. నిన్ను నడిపించడానికి అక్క కావాలి.. నువ్వు తిరగడానికి గర్ల్‌ఫ్రెండ్ కావాలి. కానీ.. కూతురొద్దు. ఆడదంటే అవసరం కాదురా.. ఆడదంటే ధైర్యం. చివరికి దేవుడైనా తల్లి కడుపులోనే పుట్టాలి’ అంటూ.. స్త్రీ గొప్పతనం, అమ్మ త్యాగం గురించి ‘లెజెండ్’లో బాలయ్య చెప్పిన డైలాగ్ క్షమయా ధరిత్రి కీర్తికి మచ్చుతునక. ‘వీళ్లతో పోలిస్తే మనకేం తెలుసు సర్.. తొడలు కొట్టడాలూ.. మీసాలు తిప్పడాలు తప్ప. పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించడం ఓ లెక్కా వీళ్లకి’ విలన్ని చంపేసి.. అతని భార్యను పంచాయితీ ప్రెసిడెంట్‌గా ప్రపోజ్ చేస్తూ ‘అరవింద సమేత..’లో ఎన్టీఆర్‌తో చెప్పించిన నాలుగే నాలుగు మాటలు నాలుగు వేదాల సారం. ‘బాధనైనా, గాయాన్నయినా తట్టుకునే శక్తి ఒక్క ఆడవాళ్లకే ఉంది. అందుకేనేమో.. దేశాన్ని అమ్మతో పోలుస్తారు’ అంటూ మాతృశక్తికి దేశభక్తిని జోడించారు మహేశ్‌బాబు
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో.
‘దేన్నయినా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది.. ఒకటి నేలకు.. రెండు వాళ్లకు’ అంటూ ‘అలవైకుంఠ పురములో..’ అల్లు అర్జున్ అమ్మకు సృష్టి- స్థితి-లయకారిణి హోదా ఇస్తాడు. ఆది హీరోగా వచ్చిన ‘సుకుమారుడు’లో ఎమ్మెస్ నారాయణ ‘తల్లి లేదంటారు శివుడికి.. తల్లి లేదంటారు.. తల్లుంటే జుట్టు అట్టలు కట్టనిచ్చునా.. తల్లుంటే పులితోలు చుట్టనిచ్చేనా.. తల్లుంటే శ్మశానంలో తిరుగనిచ్చేనా.. తల్లి లేదంటారు శివుడికి తల్లి లేదంటారు.. తల్లిలేని శివుడే అంతటి ఘనుడైతే.. తల్లి ఉన్న శివుడు ఇంకెంతటి ఘనుడవునో’ అంటూ ఉద్వేగంగా పలికే డైలాగ్ ప్రేక్షకుల కళ్ల నుంచి ఉద్వేగబాష్పాలు రాలుస్తుంది. ‘మగవాళ్లం మనకేం తెలుస్తుందయ్యా.. ఆ బాధ. అందుకే.. జన్మనిచ్చిన తల్లి ఆ దేవుడితో సమానం అన్నారయ్యా పెద్దలూ. ఈ లోకంలో చెడిపోయిన అమ్మాయిలున్నారేమో కానీ.. చెడ్డ తల్లి మాత్రం లేదయ్యా. నా దృష్టిలో ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు.. జన్మనిచ్చిన తల్లి సమానమే. కాదయ్యా.. తల్లే ఆ దేవుడి కంటే ఒక మెట్టు పైన ఉందయ్యా. ఎందుకో తెలుసా.. ఈ లోకానికి కనిపించని దేవుడికి రూపాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రపంచానికి కనిపించే దైవానికి మాత్రం ఒకే ఒక రూపం ఉంది. అదే.. అమ్మ. ఇప్పుడు నీ భార్య అమ్మ కాబోతోంది. అమ్మను జాగ్రత్తగా చూస్కో నాన్నా’ – ఈ మాటల్ని ‘నాని’ సినిమాలో కోట శ్రీనివాసరావుతో మహేశ్‌బాబు చెప్పి ఉండవచ్చు. కానీ, మాటల రచయిత వెండితెర వేదికగా సమస్త ప్రపంచానికి అమ్మ గొప్పతనాన్ని దండోరా వేసి చాటింపు వేయించాడు.
‘భూమిని తల్లి అంటారు రా! తను బతికే ఉండి.. తన బిడ్డల్ని తనలో కలిపేసుకుంటుంది. చెట్టును కూడా తల్లంటార్రా.. కాసిన కాపును రాల్చేసుకొని కొత్త కాపు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ.. కన్నతల్లి తను రాలిపోతూ.. బిడ్డలు కలకాలం బతకాలని కోరుకుంటుంది. అలాంటి తల్లిని ఒక్క పూట తిండి కోసం ఇలా ఏడిపిస్తావా రా?’ అంటూ ‘సింహరాశి’లో కన్నతల్లికి అన్నం పెట్టని కొడుకులకు మాతృవేదాన్ని వినిపిస్తాడు రాజశేఖర్. ‘ఈరోజు నాకు పర్వదినం. ఇన్నాళ్లకు నాకు మీరు జ్ఞానోదయం కలిగించారు. పాకే వయసులో బిడ్డ ఎక్కడ పొయ్యిలో చెయ్యి పెడతాడో అని పొయ్యికి, బిడ్డకి అడ్డు వేస్తుందమ్మా తల్లి. నడిచే వయసులో ఎక్కడ మెట్ల మీద నుంచి కింద పడిపోతాడో అని గుమ్మం మెట్లకి, బిడ్డకి అడ్డు వేస్తుందమ్మా తల్లి. వయసు రాగానే.. ఎక్కడ తప్పటడుగు వేస్తాడో అని వయసుకి, మనసుకి అడ్డు వేస్తుందమ్మా తల్లి. అది తల్లి బాధ్యత అని నేనుఅనుకుంటున్నాను. కాదు.. జోక్యం అని మీరనుకుంటున్నారు. మంచిది.. మీకు మీరే ఆలోచించుకోగలిగినప్పుడు.. మీకు మీరే పనులు చేసుకోగలిగినప్పుడు, మీ నిర్ణయాలు మీరే తీసుకోగలిగినప్పుడు, మీ భవిష్యత్తు మీరే నిర్ణయించుకోగలిగినప్పుడు.. ఇక నేనేం చేసినా మీకు అడ్డేనమ్మా. మీరంతా ఒకే ఇంట్లో పక్కపక్క గదుల్లో ఉంటే.. నా పక్కనే ఉన్నారనుకున్నా కానీ.. ఇంత దూరంగా ఉన్నారనుకోలేదు. అందుకనే.. దూరాలోచన చేయలేకపోయాను. ఈ క్షణం నుంచి ఈ ఇంటికి సంబంధించిన ఏ విషయంలోనూ నేను జోక్యం కలుగజేసుకోను. మీ ఏ నిర్ణయాలకు నేను అడ్డురాను. నిన్నటివరకు నా బాధ్యత అనుకున్న అమ్మ పదవికి రాజీనామా చేస్తున్నాను’ అంటూ మనసు రాయిచేసుకుని మాట్లాడుతుంది ‘అమ్మ రాజీనామా’లో అమ్మ పాత్ర.
‘మై మదర్ ఈజ్ బ్యూటిఫుల్.. షీ హాజ్ ఏ లాంగ్ హెయిర్.. షీ ఆల్వేస్ స్మైల్స్… నెవర్ స్కోల్డ్స్ మీ, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్… షీ కుక్స్ మై ఫేవరెట్ థింగ్స్.. షీ టీచెస్ మీ ఎవ్రీథింగ్.. షీ ప్లేస్ విత్ మీ.. షీ మేక్స్ మీ స్లీప్.. టెల్స్ స్టోరీస్.. అండ్ దెన్ షీ వేక్స్ మీ అప్.. యాక్చువల్లీ.. షీ యూజ్ టు మేక్ మీ స్టోరీస్.. సీ యూజ్ టు టెల్స్ స్టోరీస్.. షీ ప్లేయ్డ్ విత్ మీ లాంగ్ ఎగో.. నవ్ షీ ఈజ్ నాట్ విత్ మీ.. ఐ డింట్ క్రై.. బికాజ్ ఐ ప్రామిస్డ్ మై మదర్.. అమ్మా ఎందుకిలా చేశావ్.. ఎందుకు నాతో ప్రామిస్ చేయించుకున్నావ్.. ఎందుకు నన్ను వదిలేశావ్.. నువ్వు ఉంటే ఎప్పుడూ గెలిచేదాన్ని. ఇప్పుడు ఓడిపోతున్నానమ్మా.. పాలు తాగేస్తున్నాను.. టాబ్లెట్స్ కూడా తినేస్తున్నాను. నీకు తెలీదా అమ్మా.. నన్నిలా వదిలి వెళ్లిపోకూడదని’ అమ్మ గురించి చెప్పమని టీచర్ అడిగినప్పుడు చిన్ని సమాధానం ఇది. చిన్ని వాళ్ల అమ్మ చనిపోయి అప్పటికి కొద్దిరోజులే అయి ఉంటుంది. ఈ డైలాగ్ ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రాన్ని చూసిన ప్రతి గుండెనూ పిండేస్తుంది.
‘నేను ఒక స్కూల్ టీచర్ని. నాకు తెలిసిన భాషలో చెప్తాను. మనిషి పడే బాధను డెల్స్లో కొలుస్తారు. పంటి నొప్పి 10 డెల్స్. ఎవరైనా కత్తితో మనల్ని పొడిస్తే 20 డెల్స్. మానవ శరీరం 40 డెల్స్ వరకు భరించగలదు. అదే.. ఒక తల్లి తన బిడ్డకు జన్మనిస్తూ పడే ప్రసవ వేదన 57 డెల్స్తో సమానం. అందుకే నవమాసాలు మోసి.. నిన్ను కన్నానురా అని తల్లులు ఏడుస్తారు. అంత కష్టపడి కన్న బిడ్డ.. తల్లికంటే ముందే చనిపోతే.. ఆ తల్లి పడే బాధను ఎలా కొలుస్తారు? ఎవరికి తెలుసు? ఆ దేవుడికి కూడా తెలియదు. వాడికి ఏమైనా పిల్లలు పుట్టారా? చచ్చారా? ఆ బాధ తెలియడానికి..’ – గర్భశోకాన్ని వర్ణించడానికి లక్ష శ్లోకాలు కూడా సరిపోవు. కానీ, పదునైన సంభాషణతో వ్యక్తం చేశారు ‘లోఫర్’ సినిమా మాటల రచయిత. ఇక ‘ఛత్రపతి’లో.. ప్రతి సంభాషణా మాతృత్వ మమకారానికి మచ్చుతునకే. చెబుతూ పోతే దాదాపుగా ప్రతి సినిమాలో ఓ అమ్మ ఉండి తీరుతుంది. కథానాయకుడి గెలుపు కోసం తపిస్తూ.. తరిస్తూ ఉంటుంది. ఇదో వెండితెర మాతృపురాణం.
పదహారణాల అమ్మ వేదం. అమ్మకు జయం. అమ్మకు శుభం.
సుంకరి ప్రవీణ్ కుమార్