పవన్ కళ్యాణ్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్స్‌లో అధిక శాతం రీమేక్ చిత్రాలే. ఈ క్రమంలో పవన్ అంగీకరించిన మరో రీమేక్ మూవీ ‘వినోదయ సితం’. ఫాంటసీ కామెడీ డ్రామా కథతో తెరకెక్కి తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి పవన్ చేయబోతున్నట్లు గతంలోనే వెల్లడైంది. తాజాగా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నది.
మాతృకను రూపొందించిన నటుడు సముద్రఖని తెలుగులోనూ దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నారు. మన నేటివిటీతో పాటు పవన్ ఇమేజ్‌కు తగినట్లుగా కథలో మార్పులు చేస్తున్నారు. జనవరి నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తారని తెలుస్తున్నది. ఈ చిత్రం ఖరారు కావడంతో కొత్త ఏడాదిలో పవన్ ఖాతాలో మరో సినిమా చేరినట్లయింది. ఇప్పటికే ఆయన ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలతో పాటు దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న మరో చిత్రంలోనూ నటిస్తున్నారు.