Mokshagna | నందమూరి నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నారు. వయసు 30 దాటినా ఇంకా హీరోగా పరిచయం కాకపోవడంపై ఇప్పటికే చాలామంది అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో అని అందరు అనుకున్నారు. కానీ ఈసారి కూడా నిరాశే మిగిలింది. గత ఏడాది మోక్షజ్ఞ బర్త్‌డే సందర్భంగా బాలకృష్ణ స్వయంగా మోక్షజ్ఞ సినిమాను ప్రకటించారు. హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా రూపొందనుందని అన్నారు. ఇక ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడంతో అభిమానుల ఆనందం అవధులు దాటింది.
‘‘సింబా ఈజ్ కమింగ్’’ అంటూ ప్రచారం జరిగింది. బాలయ్య చిన్న కూతురు తేజస్విని సమర్పణలో SLV సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రకటించారు. అయితే అంత హైప్ తెచ్చుకున్న ఈ సినిమా ముందుకెళ్లడంలేదు. ముహూర్తం ఖరారు చేసినప్పటికీ, పూజా కార్యక్రమాలు జరగకుండానే ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అప్పట్లో బాలకృష్ణ మాట్లాడుతూ, “మోక్షజ్ఞకు జ్వరం వచ్చింది, త్వరలో మళ్లీ ముహూర్తం చూసి స్టార్ట్ చేస్తాం,” అని చెప్పారు. కానీ ఆ కొత్త ముహూర్తం ఇప్పటివరకు ఫిక్స్ చేయలేదు. తాజాగా ప్రశాంత్ వర్మ సైమా అవార్డ్స్ కోసం దుబాయ్ లో ప్రత్యక్షం కాగా , ‘‘మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ఇంకా పైప్‌లైన్‌లో ఉందా?’’ అని విలేకర్లు ప్రశ్నించారు.
దానికి స్పందించిన ప్రశాంత్ వర్మ.. అది నిర్మాతలు చెప్పాల్సిన విషయం. ప్రస్తుతం నేను దానిపై ఏమీ చెప్పలేను,” అని సమాధానమిచ్చారు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో తీవ్ర నిరాశను కలిగించాయి. ఎందుకంటే, ఒకవేళ ప్రాజెక్ట్ అఫీషియల్‌గా కొనసాగుతుంటే, దర్శకుడు ‘‘త్వరలో షెడ్యూల్ మొదలవుతుంది’’ వంటి మాటలు చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం బంతిని పూర్తిగా నిర్మాతల కోర్టులో పడేయడం, ఈ ప్రాజెక్ట్ వాయిదా పడిందనే సందేహాలను మరింత బలపరిచింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నారా రోహిత్ మాట్లాడుతూ.. “మోక్షజ్ఞ మంచి లవ్ స్టోరీ కోసం వెతుకుతున్నాడు,” అని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో, ఇప్పటికే స్క్రిప్ట్ ఫిక్స్ అయిందని, ఆ లవ్ స్టోరీతో మోక్షజ్ఞ సెట్స్ మీదకు వెళతాడని అనుకుంటున్నారు.