Mirai | యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేస్తూ, 100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. విడుదలైన 5 రోజులలోపే ఈ రికార్డును అందుకోవడం చిత్ర పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఫాంటసీ, యాక్షన్, సూపర్ హీరో జానర్ల మేళవింపుతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. విడుదలైన ప్రతి రోజు నుండి హౌస్‌ఫుల్ షోస్‌తో నడుస్తున్న ఈ చిత్రం 5 రోజుల్లో వంద కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. అమెరికా బాక్సాఫీస్ వద్ద $2 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసింది. ఇండియాలో మంగళవారం ఒక్కరోజే లక్షకుపైగా టికెట్ల అమ్మకం జరిగింది.
‘హనుమాన్’ బ్లాక్‌బస్టర్ తర్వాత తేజ సజ్జా మరోసారి తన సత్తా చాటాడు. స్టార్ హీరోలు మాత్రమే సాధించగల స్థాయిలో వసూళ్లను సాధిస్తూ అదరగొడుతున్నాడు. కంటెంట్ సెలెక్షన్, కమిట్మెంట్కి తగిన ప్రతిఫలం అందుకుంటున్నాడు. మిరాయ్ విజయానికి మూల కారణాలుగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని అందించిన విజువల్ ట్రీట్, నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ భారీ నిర్మాణ విలువలు, తేజ సజ్జా డెడికేషన్, అదిరిపోయే పెర్ఫార్మెన్స్, మనోజ్ మంచు విలన్ పాత్రలో పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. తేజ-మనోజ్ మధ్య యాక్షన్ సీన్లు సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి. ఈ కాంబినేషన్ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. మిరాయ్లోని ఫాంటసీ ఎలిమెంట్స్, విజువల్స్ పాన్ ఇండియా ప్రేక్షకులకు కనుల విందుగా మారాయి.
సాధారణంగా 100 కోట్లు సాధించడం స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమని భావించే కాలంలో, తేజ సజ్జా లాంటి యువ హీరో ఈ రికార్డు నెలకొల్పడం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇది తెలుగు సినిమాకే గర్వకారణమని వారు చెబుతున్నారు. ఇప్పటికే 100 కోట్ల క్లబ్లో చేరిన ‘మిరాయ్’, రాబోయే రోజుల్లో 200 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా విజయంతో తేజ సజ్జా తనకంటూ ప్రత్యేకమైన సూపర్ హీరో ఇమేజ్ను పాన్ ఇండియా స్థాయిలో ఏర్పర్చుకున్నాడు. మొత్తంగా, ‘మిరాయ్’ విజయం తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచింది అని చెప్పవచ్చు. అంతేకాకుండా తేజ సజ్జా నేమ్ ఇప్పుడు కంటెంట్ విత్ కమర్షియల్ సక్సెస్‌కి మారుపేరుగా మారుతోంది.