Aasmaan | దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరి జయంతి వేడుకల సందర్భంగా ఆయన తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘ఆస్మాన్’ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేసింది. శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై శ్రీమతి కొండారు శ్రీనివాసరావు సమర్పణలో వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు అరబిక్ భాషల్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక పెద్ద అరచేతి మధ్యలో హీరో మేఘాంశ్ కాగడా పట్టుకుని నిలబడి ఉండటం, ఆ అరచేతి నుదురుపై వినూత్నంగా డిజైన్ చేసిన బొట్టు ఉండటం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా, ఆ అరచేతి చుట్టూ జనులందరూ కాగడాలు పట్టుకుని నిలబడిన దృశ్యాలు సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. అసలు ఆ అరచేతి రహస్యం ఏంటి? ఈ చిత్రంలో మేఘాంశ్ పాత్ర ఎంతటి పవర్‌ఫుల్‌గా ఉండబోతుందనే క్యూరియాసిటీ సర్వత్రా నెలకొంది.
ఈ ప్రత్యేక కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు సినిమాకు సంబంధించిన పలు కీలక విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా మేఘాంశ్ తల్లి, ప్రముఖ నటి శాంతి శ్రీహరి భావోద్వేగంతో మాట్లాడారు. మేఘాంశ్ మీద ఉన్న నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్తున్న దర్శక నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. రాత్రి అనక, పగలు అనక మేఘాంశ్ ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడని, తన తండ్రి శ్రీహరిలాగే ప్రతి కళాకారుడు అంకితభావంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు తన కుమారుడిని చిన్న పిల్లాడిలాగే చూసేదాన్ని అని, కానీ ఈ పోస్టర్ చూశాక ఒక సింహంలా కనిపించాడని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ‘ఆస్మాన్’ చిత్రంతో మేఘాంశ్ నటుడిగా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ, ఈ చిత్రంలో తనకు అవకాశం కల్పించిన నిర్మాతలకు, దర్శకుడు రామ్ నందన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సెట్లో ఎప్పుడూ ఒక పండుగ వాతావరణం లాంటి పాజిటివ్ వైబ్ ఉంటుందని, ఈ సినిమాలో హీరోయిన్గా రాయంచ నటిస్తుండగా, ప్రశాంత్ ఆర్ విహారి అందిస్తున్న నేపధ్య సంగీతం సినిమాకే హైలైట్‌గా నిలవనుందని వెల్లడించారు.
దర్శకుడు రామ్ నందన్ మాట్లాడుతూ, ‘ఆస్మాన్’ సినిమా ప్రేక్షకులకు ఇప్పటివరకు చూడని సరికొత్త అనుభూతిని పంచుతుందని, థియేటర్లలో అందరినీ ఆశ్చర్యపరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ, మేఘాంశ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి తామంతా ఆశ్చర్యపోయామని, రియల్ స్టార్ కొడుకు అంటే ఇలాగే ఉంటాడని నిరూపించేలా ఆయన నటన ఉంటుందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ రాయంచ, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్ విహారి, సినిమాటోగ్రాఫర్ షోయబ్, నటుడు రవివర్మ తదితరులు మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ పట్ల తమకున్న ఉత్సాహాన్ని పంచుకున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్లను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ చిత్రంలో మేఘాంశ్ శ్రీహరి, రాయంచ ప్రధాన తారాగణంగా నటిస్తుండగా.. రవివర్మ, కమల్, కేశవ్ దీపక్, నిఖిల్, రాజశేఖర్, పద్మిని, ప్రేరణ గ్యాంగ్, సంతోష్, రమణ, కుమార్, సత్యరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమాకు శ్రీమతి కొండారు శ్రీనివాసరావు సమర్పకులుగా వ్యవహరిస్తుండగా, కొండారు వెంకటేష్ మరియు మన్నెం శ్రీకాంత్ నిర్మాతలుగా ఉన్నారు. రామ్నందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి షోయబ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మణికంఠ ఆర్ట్ డైరెక్టర్‌గా, స్వప్న కొండారు సీఈవోగా, నరేష్ ఎడిటర్‌గా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీత దర్శకుడిగా, ధని ఏలె పోస్టర్ డిజైనర్‌గా సేవలందిస్తున్నారు. పీఆర్వో బాధ్యతలను నాయుడు – ఫణి (బియాండ్ మీడియా) నిర్వహిస్తున్నారు.

Aasmaan