చిరంజీవి పుట్టినరోజు వచ్చిందంటే ఆ రోజు అభిమానులకు పండుగే. తెలుగు రాష్ర్టాల్లో గత కొన్నేళ్లుగా ఈ వేడుకను ఫ్యాన్స్ ఘనంగా జరుపుకుంటూనే ఉన్నారు. అదేరోజు మెగాస్టార్ తాజా సినిమాల అప్డేట్లను విడుదల చేయడం నిర్మాతలకు ఆనయితీ. దాన్ని కొనసాగిస్తూ ఈ నెల 22న చిరంజీవి తాజా సినిమాల వివరాలతో క్రేజీ అప్డేట్లు రానున్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నెల 22న ఈ సినిమా టైటిల్‌ని మేకర్స్ ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ‘మన శివశంకర వరప్రసాద్‌గారు’ అనే టైటిల్‌తోపాటు ‘సంక్రాంతి’ సౌండింగ్ వచ్చేలా మరో టైటిల్‌ని కూడా అనుకుంటున్నారు.
మరి ఈ రెంటిలో చిరు ఓటు దేనికి పడితే అదే టైటిల్‌గా బయటకు వస్తుంది. ఇక అదే రోజు చిరంజీవి ‘విశ్వంభర’ నుంచి ఓ పాటను విడుదల చేసేందుకు ఆ చిత్ర మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా సంగీతం ఎం.ఎం.కీరవాణి అయినా.. ఇటీవల భీమ్స్ సిసిరోలియో స్వరకల్పనలో ఓ ఐటమ్ సాంగ్‌ను దర్శకుడు వశిష్ట తెరకెక్కించారు. ఆ పాటే మెగాస్టార్ బర్త్‌డే రోజు బయటకు వస్తుందని ఫిల్మ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే చిరు-బాబీ సినిమాకు చెందిన అధికారిక ప్రకటన కూడా చిరు పుట్టిన రోజునే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. దీన్ని బట్టి ఆ రోజు మెగా అభిమానుల సందడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.