Waltair Seenu | కొన్ని టైటిల్స్ కొంత మందికే నప్పుతాయి.. మరికొన్ని టైటిల్స్ కథలకు టైలర్‌మేడ్‌గా ఉంటాయి. కొన్ని టైటిల్స్‌కు, కథలకు అసలు సంబంధం ఉండదు. అయితే కొంతమంది దర్శకులు టైటిల్స్ విషయంలో అసలు రాజీపడరు. తమ సినిమాకు సరిపోయే టైటిల్ ఎవరి దగ్గర ఉన్నా.. వాళ్లను జుజ్జగించో..లేక డబ్బులు చెల్లించో ఆ టైటిల్‌ను చేజిక్కించుకుంటారు. ఇవన్నీ తెలుగు సినీ పరిశ్రమలో సర్వసాధారణమే. ఇప్పుడు ఇలాంటి రాజీ, చర్చలు ఓ టైటిల్ కోసం జరుగుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి కథకు తగ్గట్టుగా వాల్తేరు శీను అనే టైటిల్‌ను అనుకున్నారు. తీరా టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం వెళితే ఆ టైటిల్ ఆల్రెడీ సుమంత్ హీరోగా రూపొందుతున్న ఓ చిత్రానికి రిజిస్టర్ చేసుకున్నారు నిర్మాతలు. దాంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, సుమంత్ చిత్ర నిర్మాతతో సంప్రదింపులు జరిపింది. అయితే తమ సినిమాకు వాల్తేరు శీను అనేది రెండో టైటిల్‌గా అనుకుంటున్నామని సుమంత్ చిత్రానికి అనగనగా ఓ రౌడీ అనే టైటిల్ ఫిక్స్ చేశామని నిర్మాతలు చెప్పడంతో ఆ టైటిల్ ఇక తమకు వచ్చినట్లేనని అనుకున్నారు మెగాస్టార్ చిత్ర దర్శక , నిర్మాతలు. అయితే ఈ లోపు మరో ట్విస్ట్ జరిగింది.
సుమంత్ చిత్రానికి ఫైనాన్స్ ఇచ్చిన ఫైనాన్షియర్ నిర్మాతతో సంబంధం లేకుండా అనగనగా ఓ రౌడీ టైటిల్‌ను వాల్తేరు శీనుగా మార్చి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక మళ్లీ వాల్తేరు శీను టైటిల్ విషయంలో సీన్ మొదటికొచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ చిత్ర నిర్మాతలు వాల్తేరు శీను టైటిల్ కోసం ప్రయత్నించడంతో పాటు మరో టైటిల్ గురించి కూడా ఆలోచిస్తున్నారు.
– Maduri Mattaiah