Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో పాటు ఫ్యామిలీకి కూడా అంతే ప్రియారిటీ ఇస్తుంటారు. అందుకే ఏమాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో సరదాగా గడిపేస్తుంటారు. వెకేషన్స్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. కొన్నాళ్లుగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవికి.. ఇప్పుడు కాస్త టైమ్ దొరకడంతో అర్ధాంగి సురేఖతో కలిసి హాలీడే ట్రిప్ వెళ్లిపోయాడు. వాలంటైన్స్ డే సందర్భంగా సతీమణితో సరదాగా గడిపేందుకు అమెరికాకు వెకేషన్ వెళ్లాడు.
తన హాలీ డే ట్రిప్ గురించి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ (ఎక్స్) ద్వారా తెలియజేశాడు. సురేఖతో దిగిన ఫొటోను కూడా ఈ సందర్భంగా షేర్ చేశాడు. రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తున్నాడు. ఏడాదిలో కనీసం రెండు సినిమాలు అయినా రిలీజయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలతో వచ్చాడు. ఇప్పుడు బింబిసార డైరెక్టర్ వశిష్ట మల్లాడి దర్శకత్వంలో సోషియా ఫాంటసీ చిత్రం విశ్వంభరలో నటిస్తున్నాడు. ఇందులో భీమవరం దొరబాబుగా చిరంజీవి కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి తీవ్ర కసరత్తులే చేస్తున్నాడు. ఫిట్‌గా కనిపించేందుకు జిమ్‌లోనూ కష్టపడుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో రీసెంట్గా తెగ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. కాగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఉద్దేశంతో ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. ఈ క్రమంలో షూటింగ్‌కు కాస్త గ్యాప్ దొరకడంతో మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకుని.. భార్య సురేఖతో కలిసి అమెరికా వెళ్లాడు.