ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో పంజాబీ భామ మీనాక్షి చౌదరి హవా నడుస్తున్నది. ఈ ఏడాది వరుసగా భారీ సినిమాల్లో ఆమె అవకాశాలను సొంతం చేసుకుంది. ఇటీవల విడుదలైన ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో కెరీర్లోనే మంచి విజయాన్ని దక్కించుకోవడం ఈ సొగసరికి బాగా కలిసొచ్చింది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ‘మెకానిక్ రాకీ’ ఈ శుక్రవారం విడుదల కానుంది. మరో ఏడాది పాటు ఈ ముద్దుగుమ్మ డేట్స్ ఖాళీగా లేవని ఇండస్ట్రీలో వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో మీనాక్షి చౌదరి తెలుగులో మరో బంపరాఫర్‌ను దక్కించుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. యువ హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘తండేల్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం ఆయన ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం కథానాయిక కోసం అన్వేషణ సాగుతున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇద్దరు నాయికలకు చోటుందని, అందులో ఒకరిగా పూజాహెగ్డేను ఇప్పటికే ఖరారు చేయగా..రెండో నాయికగా మీనాక్షి చౌదరిని ఎంపిక చేశారని తెలిసింది. త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం. చైతన్య సరసన మీనాక్షి చౌదరి నటించడం ఇదే తొలిసారి. వీరిద్దరి కాంబినేషన్ కొత్తగా ఉంటుందని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇలా వరుసగా భారీ ఆఫర్లతో ఇండస్ట్రీలో లక్కీయెస్ట్ హీరోయిన్గా చెలామణి అవుతున్నది మీనాక్షి చౌదరి.