Mayasabha | ప్రేక్షకులకు విభిన్నమైన కంటెంట్‌ను అందించడంలో ముందున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్. ఇప్పుడు రాజకీయ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ‘మయ సభ’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. “రైజ్ ఆఫ్ ది టైటాన్స్” అనేది ఈ సిరీస్ ట్యాగ్ లైన్. సీనియర్ దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్‌కి నిర్మాతలుగా విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష వ్యవహరించగా, హిట్ మ్యాన్ & ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై తెరకెక్కింది. ముఖ్య పాత్రల్లో ఆది పినిశెట్టి, చైతన్య రావు, దివ్య దత్తా, సాయికుమార్, శత్రూ, శ్రీకాంత్ అయ్యంగార్, తన్య రామచంద్రన్, రవీంద్ర విజయ్ తదితరులు నటించారు.
ఈ కథకు ప్రేరణగా ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన నేతలు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మధ్య ఉన్న స్నేహం, అనంతరం వారిద్దరి మధ్య ఏర్పడిన రాజకీయ విరోధతను తీసుకున్నట్టు దేవా కట్టా తెలిపారు. అయితే ఇది పూర్తిగా కల్పితమైన కథేనని, కొన్ని సంఘటనలు మాత్రం కాల్పనికంగా మలిచామని ఆయన స్పష్టం చేశారు. ఒకే లక్ష్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇద్దరు స్నేహితులు, తర్వాత దారి మార్చుకొని విడిపోయిన సందర్భాలను బలంగా చూపించనున్నట్టు చెప్పారు.తాజాగా విడుదలైన ట్రైలర్ పలు సంచలనాత్మక డైలాగ్‌లతో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇద్దరు స్నేహితులు రాజకీయ ప్రత్యర్ధులుగా ఎలా మారారన్న పాయింట్‌తో ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించారు.
ట్రైలర్‌లోని సన్నివేశాలు, డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. జీవితంలో ఏదో సాధించాలి, ప్రజలకు అండగా నిలబడాలనే లక్ష్యంతో రాజకీయాల్లో అడుగు పెట్టిన ఇద్దరు స్నేహితుల ప్రయాణం ఎలా సాగింది? కలిసి తిరిగిన వారు రాజకీయ గమనంలో ప్రత్యర్ధులుగా మారడానికి కారణాలు ఏంటి? ఇద్దరి గొప్ప స్నేహితుల మధ్య ఉండే స్నేహం, మానసిక సంఘర్షణ.. పొలిటికల్ జర్నీలో వారు ఎదుర్కొన్న పరిస్థితులను భావోద్వేగంగా మయసభ వెబ్ సిరీస్‌లో ఆవిష్కరించనున్నట్టు తెలుస్తుంది.