Irumudi Review | రవితేజ హీరోగా ‘ఇరుముడి’ అనే టైటిల్ ప్రకటించినప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఇందులోని పాటలు, ట్రైలర్లో చూపించిన ఫ్యామిలీ ఎమోషన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. కచ్చితంగా రవితేజకి ఇది కమ్‌బ్యాక్ సినిమా అవుతుందని అందరూ భావించారు. మరి ఆ అంచనాలను ‘ఇరుముడి’ అందుకుందా? దర్శకుడు శివ నిర్వాణ ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో వేసిన ‘ఇరుముడి’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో రివ్యూలో చూద్దాం.
కథ
సీలేరు ప్రాంతంలో త్రినాథ్(రవితేజ) ఆటో నడుపుతూ, అరటిపళ్ల వ్యాపారం చేస్తూ కూతురు మణెమ్మ(నక్షత్ర), భార్య కావేరి(ప్రియా భవానీ శంకర్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. ఆ ప్రాంతంలో అందరి ఆడపిల్లలని తన కూతురులానే చూస్తుంటాడు. తనకు మద్యం అలవాటు ఉంటుంది. కాకపోతే అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పుడు మాత్రం మందు జోలికి వెళ్లడు. అదే ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్ధిని అనూహ్యంగా చనిపోతుంది. ఆ మరణం వెనుక ఉన్నది ఎవరు? ఈ చావు త్రినాథ్ కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేసిందనేది మిగతా కథ.
విశ్లేషణ
తెలుగులో చాలా క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చాయి. కాకపోతే కుటుంబ, అయ్యప్ప మాల నేపథ్యంలో ఒక ఎమోషనల్ థ్రిల్లర్‌గా ‘ఇరుముడి’ ప్రత్యేకంగా కనిపిస్తుంది. సినిమా కథ ప్రారంభం ఓ స్కూల్లో టీచర్ సస్పెండ్ అవడంతో మొదలవుతుంది. ఆ తర్వాత కుటుంబం, మణెమ్మతో ఉన్న ఎమోషనల్ బాండింగ్‌ను ఎస్టాబ్లిష్ చేయడానికి కొంత సమయం పడుతుంది. ఎప్పుడైతే పదో తరగతి చదువుతున్న ఓ అమ్మాయి అనూహ్యంగా చనిపోతుందో, అక్కడి నుంచి కథలో ఉత్కంఠ పెరుగుతుంది. అది విరామానికి వచ్చేసరికి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి, ఎమోషన్ కలిగిస్తుంది. ఈ కథను దర్శకుడు హ్యాండిల్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. కథలో మంచి ట్విస్టులు రాసుకున్నారు. అలాగే ప్రీ-క్లైమాక్స్‌కు ముందు కాస్త సాగదీసినట్టుగా అనిపించినప్పటికీ, క్లైమాక్స్‌ను మాత్రం బలంగా రాసుకున్నారు. అదే సమయంలో ఆ క్లైమాక్స్ మనసును కలచివేస్తుంది. ఒక హార్ట్ టచింగ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా కథను దర్శకుడు శివ నిర్వాణ నడిపించారు. అదే సమయంలో ఒక బలమైన సందేశం కూడా ఇచ్చారు. ఆ సందేశం కచ్చితంగా గుర్తుపెట్టుకుని పాటించదగ్గదిగా ఉంటుంది.
నటీనటుల నటన
రవితేజ తన మాస్ ఇమేజ్ను పక్కన పెట్టి పూర్తిగా ఎమోషనల్ క్యారెక్టర్లో నటించారు. త్రినాథ్ పాత్రలో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. ఒకవైపు ఎమోషనల్ తండ్రిగా, మరోవైపు మద్యానికి బానిసైన వ్యక్తిగా, అయ్యప్ప మాల వేసుకున్న భక్తుడిగా, చివర్లో ఒక తండ్రిగా.. తన పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ అన్నింటినీ రవితేజ చాలా పరిణతితో కనబరిచారు. అలాగే మణెమ్మ పాత్రలో చేసిన బేబీ నక్షత్ర పాత్ర కూడా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో ఆ పాత్ర కంటతడి పెట్టిస్తుంది. రవితేజ భార్య పాత్రలో కనిపించిన ప్రియా భవానీ శంకర్ పోషించిన కావేరి పాత్ర కూడా చాలా హుందాగా ఉంటుంది. ఆ పాత్ర ఈ సినిమాకు కావాల్సిన ఎమోషన్‌ను యాడ్ చేసింది. గురుస్వామి పాత్రలో చేసిన సాయికుమార్ పాత్ర ఆయనకు చాలా కొత్తగా, అదే సమయంలో ప్రభావవంతంగా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో ఆ పాత్రకు దర్శకుడు రాసుకున్న ఒక మలుపు కూడా కథకు బలాన్ని చేకూర్చింది. అలాగే అజయ్ ఘోష్ పాత్ర కూడా కావాల్సిన క్యూరియాసిటీని పెంచింది. మిగతా నటీనటులు పరిధి మేరకు కనిపించారు.
టెక్నికల్‌గా
జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్కు మంచి మార్కులు పడతాయి. అలాగే ‘మల్లెపూల పల్లకి’ పాట థియేటర్లో ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. జీవీ ప్రకాష్ చేసిన నేపథ్య సంగీతం కూడా సినిమా కథకు, కథ మూడ్‌కు తగ్గట్టుగా కుదిరింది. కెమెరా వర్క్ కూడా చాలా నేచురల్‌గా ఉంది. సీలేరు ప్రాంతంలో తీసిన చిత్రమిది. అన్ని ఒరిజినల్ లొకేషన్స్ కావడంతో కథ నిజంగా అక్కడే జరుగుతున్నట్టుగా అనుభూతిని కలిగించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
కథ, కథనం
రవితేజ నటన
బేబీ నక్షత్ర పాత్ర
సంగీతం
మైనస్ పాయింట్స్
ఆరంభంలో కొన్ని సన్నివేశాలు
ప్రీ-క్లైమాక్స్‌లో అక్కడక్కడా నెమ్మది
ఫైనల్‌గా: ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఒక రూరల్ క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకునే ప్రేక్షకులకు ‘ఇరుముడి’ సినిమా నచ్చేస్తుంది.
రేటింగ్: 3.5/5