Manchu Vishnu | ‘కన్నప్ప’ మూవీతో సత్తా చాటిన మంచు విష్ణు, ఇప్పుడు మెగా విజన్‌తో ముందుకెళ్తున్నారు. ‘కన్నప్ప’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా, విష్ణు నటన మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ సినిమాకి ముందు, తర్వాత ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ ప్రకటించని విష్ణు.. ఇప్పుడు తన మనసు రామాయణం సినిమా మీద ఉందని అన్నారు. ఇప్పటికే రామాయణం స్క్రిప్ట్ రెడీగా ఉందని, 2009లోనే తమిళ స్టార్ సూర్యని శ్రీరాముడి పాత్రలో నటించమని చెప్పానని, కాకపోతే అప్పట్లో బడ్జెట్ కారణంగా ఆ ప్రాజెక్ట్ వర్కవుట్ కాలేదని చెప్పాడు. తాజాగా ఈ స్క్రిప్ట్‌కి మరోసారి జీవం పోసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
మంచు విష్ణు మనసులో శ్రీరాముడిగా సూర్య, సీతా దేవిగా ఆలియా భట్, లక్ష్మణుడిగా నందమూరి కళ్యాణ్ రామ్, హనుమంతుడిగా మంచు విష్ణు, రావణాసురుడిగా మోహన్ బాబు, ఇంద్రజిత్ గా కార్తీ, జటాయుగా సత్యరాజ్ ఉన్నారు. ఈ స్టార్ కాస్ట్ చూస్తే ప్రాజెక్ట్ ఏ రేంజ్లో ఉంటుందో అర్ధమవుతుంది. ‘కన్నప్ప’ కోసం ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్ లాంటి బిగ్ స్టార్లను తీసుకురాగలిగిన విష్ణు, ఆలియా భట్‌ను ఈ రామాయణం కోసం తీసుకురావడం పెద్ద సమస్యగా మారకపోవచ్చు. కానీ సూర్య హైట్, స్క్రీన్ ప్రెజెన్స్, తదితర విషయాలు ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇప్పటికే రణ్‌బీర్ కపూర్‌తో నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ బాలీవుడ్ రామాయణ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది . రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది దీపావళికి ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సమయంలో మంచు విష్ణు రామాయణంని మొదలు పెడతాడా అనేది ఆసక్తికరంగా మారింది. మంచు విష్ణు తన ‘డ్రీమ్ ప్రాజెక్ట్’గా ఈ పౌరాణిక గాథను తెరపైకి తీసుకురావడమే గాక, అందులో తాను హనుమంతుడిగా నటించాలని భావించడం, అలాగే తన తండ్రి మోహన్ బాబుకు రావణుడి పాత్ర ఇవ్వడం విశేషం. అన్ని అనుకున్నట్లు జరిగితే, మనముందుకు మరో విభిన్నమైన రామాయణం రాబోతున్నదని చెప్పొచ్చు.