“కన్నప్ప’ కథ కల్పితం కాదు. ఇది మన చరిత్ర. మన మధ్య జీవించిన మనలాంటి ఓ వ్యక్తి కథ. ‘కన్నప్ప’కు ఇప్పటివరకూ లక్షకు పైగా టికెట్లు తెగాయి. ఇంతటి స్పందనకు కారణం ఆ శివుడే. ఇప్పుడంతా ‘కన్నప్ప’ను చూడాలని కోరుకుంటున్నారు. అందుకే సినిమా చూడటం కుటుంబాలకు భారం కాకూడదని టికెట్ రేట్లను కూడా మేం పెంచడం లేదు. ఏపీలో మాత్రం కొన్ని చోట్ల పెంచాం. కన్నప్ప కోసం మా టీమ్ పడిన కష్టాన్ని జీవితాంతం మరిచిపోలేను. ఇక ప్రభాస్‌కి అయితే.. నేను జీవితాంతం రుణపడి ఉంటా. నేనూ నా తండ్రితో పాటు నా నలుగురు పిల్లలూ ఈ సినిమాలో నటించాను.
ఓ తండ్రిగా నా పిల్లల్ని తెరపై చూసుకోవడం కూడా ఓ గొప్ప అనుభూతి. తెలుగుతోపాటు, కేరళ, కర్నాటకలోనూ పెద్ద ఎత్తున ఈ సినిమా విడుదల అవుతున్నది. ఈ సినిమా పది వారాల వరకూ ఓటీటీలో రాదు’ అని మంచు విష్ణు చెప్పారు. ఆయన కథానాయకుడిగా ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన భక్తిరసాత్మక చిత్రం ‘కన్నప్ప’. డా.మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కానుంది.
ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో మంచు విష్ణు విలేకరులతో ముచ్చటించారు. ‘ దేవుడికీ, భక్తునికీ మధ్య ఎవరూ ఉండాల్సిన పనిలేదు. పవిత్రమైన భక్తి ఉంటే చాలు. మూఢ నమ్మకాలు అవసరం లేదని చెప్పడమే మా ఉద్దేశ్యం. కేవలం ఈ స్క్రిప్ట్ మీదున్న నమ్మకంతోనే ఇంత బడ్జెట్ పెట్టి, ఇంత రిస్క్ తీసుకొని ఈ సినిమా చేశాం. ఆ శివుడు ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది’ అని మంచు విష్ణు నమ్మకం వెలిబుచ్చారు.