Manchu Family Disputes | ప్రముఖ తెలుగు నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం వివాదం మళ్లీ మొదటికి చేరింది. కుటుంబం మధ్య ఆస్తుల గొడవలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు, ఆయన తనయుడు మంచు మనోజ్ సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చారు. మోహన్ బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి సబ్ కలెక్టర్ ఇద్దరినీ విచారణ కోసం పిలిచారు. ఈ క్రమంలో తండ్రీ కొడుకులు ఇద్దరు కార్యాలయానికి చేరుకున్నారు. మనోజ్ తనతో కీలక డాక్యుమెంట్లను సైతం తీసుకువచ్చాడు. మంచు విష్ణు తన ఆస్తులను ఆక్రమించినట్లుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మేజిస్ట్రేట్ హోదాలో కలెక్టర్ వారిని విచారణకు పిలిచారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ తన ఆస్తులన్నీ స్వార్జితమని, వాటిపై ఎవరికీ హక్కు లేదని పేర్కొన్నారు. మనోజ్ నా ఆస్తులను నాకు అప్పగించాల్సిందేనన్నారు.
అయితే, తాను సంపాదించుకున్న ఇల్లు, ఇతర ఆస్తులను మనోజ్ ఆక్రమించారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు, వృద్ధులు, సంరక్షణ, పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలంటూ మోహన్‌బాబు తన ప్రతినిధి ద్వారా కలెక్టర్‌కు లేఖను పంపారు. బాలాపూర్ మండలం జల్పల్లి గ్రామంలోని తన ఇంట్లోకి అక్రమంగా మనోజ్ ప్రవేశించి.. ఆస్తుల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికారులు మనోజ్‌కు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని చెప్పారు. మనోజ్ జనవరి 19న కలెక్టరేట్‌కు వచ్చి.. అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ తమ తండ్రి, అన్నదమ్ముల మధ్య ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని మంచు మనోజ్ చెప్పాడు. తమ విద్యాసంస్థలు, ట్రస్టుల్లో విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని వ్యతిరేకించినందుకే విష్ణు తండ్రి మోహన్‌బాబును అడ్డుపెట్టుకుని నాటకమాడుతున్నారని ఆరోపించాడు. తన వద్ద డబ్బులు లేవంటున్న తండ్రి మోహన్ బాబు రూ.వందల కోట్లు పెట్టి ఎలా సినిమా తీస్తున్నాడని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు విద్యార్థుల కోసం పోరాడుతున్నానని.. ఆస్తుల కోసం కాదని మనోజ్ స్పష్టం చేశాడు.