సినీరంగంలో నటీనటుల జీవితాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరు చెప్పలేరు. ఊహించని స్థాయిలో దెబ్బలు తగులుతుంటాయి. వరుసగా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్న నటీనటులు కూడా అవకాశాలు లేక చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అందులో ఐశ్వర్య భాస్కరన్ కూడా ఒకరు. సీనియర్ నటి లక్ష్మీ కూతరుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాదిలో పలువురు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా నటించింది. అయితే హీరోయిన్గా ఎక్కువ సినిమాలు చేయలేదు కాని క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరున్న పాత్రలు చేసి ప్రేక్షకుల మదిలో చోటు సంపాదించుకుంది. ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’, ‘నాని’, ‘ఆరు’ వంటి పలు సినిమాలలో నటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి దాదాపు 200లకు పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది.
అంతటి బిజీయెస్ట్ నటి ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి సబ్బులు అమ్ముకుంటుందట. ఈ విషయాన్ని ఐశ్వర్య స్వయంగా చెప్పింది. తాజాగా ఓ తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో తన ఆర్థిక పరిస్థితి గురించి తెలుపుతూ కన్నీరు పెట్టుకుంది. ఈ సందర్భంగా ఐశ్వర్య మాట్లాడుతూ ‘ప్రస్తుతం నాకు పనిలేదు. డబ్బులేదు. ఉన్న ఒక్క కూతురు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నా ఫ్యామిలీలో నేనొక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి పనిచేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. రేపు మీ ఆఫీసులో జాబ్ ఇస్తానంటే తప్పకుండా చేస్తా. అవసరమైతే టాయిలేట్స్ కూడా క్లీన్ చేస్తా అంటూ వెల్లడించింది’. ప్రస్తుతం ఐశ్వర్య యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తూ సబ్బులు అమ్ముకుంటున్నట్లు తెలిపింది. అంతేకాకుండా తను ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే తనకు ఇప్పుడు ఓ మెగా సీరియల్ ఆఫర్ కావాలి అంటూ వెల్లడించింది.