Malayalam actor Shine Tom Chacko | మలయాళం నటుడు షైన్ టామ్ చాకోని కేరళలోని కొచ్చి సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీసుకున్నాడనే ఆరోపణలతో పాటు, మాదకద్రవ్యాల వినియోగం, కుట్ర కింద అతడిపై కేసు నమోదు చేయబడింది. NDPS(మాదకద్రవ్యాలు మరియు మానసిక ప్రభావాలను కలిగించే పదార్థాలు) చట్టంలోని 27, 29 సెక్షన్లు అతడిపై విధించబడ్డాయి.
డ్రగ్స్ రైడ్ విషయంలో నేడు షైన్ టామ్ చాకో పోలీసుల ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన ఈ విచారణలో పోలీసులు అతడినుంచి పలు కీలక ఆధారాలు రాబట్టారు. డ్రగ్స్ తీసుకున్నాడా అనే విషయంకు సంబంధించి.. అతని గోళ్లు, జుట్టు సహా శాంపిళ్లను పరీక్షకు పంపనున్నారు. మరోవైపు టామ్ చాకోకి డ్రగ్స్ సప్లయ్ చేసిన డ్రగ్ డీలర్ సజీర్ను తనకు తెలుసని షైన్ విచారణలో అంగీకరించినట్లు సమాచారం. సజీర్ను వెతుక్కుంటూ పోలీసులు హోటల్‌కు చేరుకున్నప్పుడు, షైన్ కిటికీ గుండా దూకి పారిపోయినట్లు ఒప్పుకున్నాడు. అంతేగాకుండా.. షైన్ పారిపోయిన రోజు సజీర్తో కలిసి రూ. 20,000ల డ్రగ్స్ లావాదేవీ జరిగినట్లు తెలిసింది. అయితే ఆ రోజు తాను డ్రగ్స్ వాడలేదని షైన్ పోలీసులకు తెలిపాడు. ఈ సమాచారం ఆధారంగా షైన్‌పై డ్రగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. హోటల్ నుంచి ఎందుకు పారిపోయావంటూ పోలీసులు షైన్‌ని ప్రశ్నించగా.. తనమీద గుండాలు అటాక్ చేస్తున్నారని భయపడి వెనుకనుంచి పారిపోయినట్లు షైన్ తెలిపాడు.